: తమిళనాడుకు ప్రస్తుతం సీఎం ఉన్నాడుగా... ఇంకా గోలేంటి?: వెంకయ్యనాయుడు

తమిళనాడు రాష్ట్రం ముఖ్యమంత్రి లేకుండా, పాలన పడకేసిన స్థితిలో ఏమీ లేదని, ఆ రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఉన్నాడని, పరిపాలన చక్కగా సాగుతోందని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్యనాయుడు వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో ప్రభుత్వమే లేదని, తనను ప్రమాణ స్వీకారానికి పిలవాలని శశికళ డిమాండ్ చేసిన నేపథ్యంలో వెంకయ్య స్పందించారు. గవర్నర్ విద్యాసాగర్ రావు నిష్పక్షపాతని పేర్కొన్న వెంకయ్య, ఆయన అన్నీ ఆలోచించే నిర్ణయాన్ని తీసుకుంటారని, తమిళ ప్రజల మంచి కోసం కృషి చేస్తారనడంలో సందేహం లేదని అన్నారు. అన్నాడీఎంకేలో జరుగుతున్న సంక్షోభం ఆ పార్టీకి సంబంధించిన వ్యవహారమేనని, ఇందులో బీజేపీ జోక్యం ఉండబోదని స్పష్టం చేశారు. మరిన్ని రోజుల పాటు ఎమ్మెల్యేలను దాచి వుంచాలని చూడటం ప్రజాస్వామ్య విరుద్ధమని పేర్కొన్నారు. ఈ గోలను ఇంతటితో ఆపి, గవర్నర్ నిర్ణయం వచ్చే వరకూ ఎవరి పనుల్లో వాళ్లు నిమగ్నం కావాలని, ప్రజా సమస్యల పరిష్కారానికి ఎమ్మెల్యేలు, మంత్రులు పని చేయాలని సూచించారు.

More Telugu News