: ఇది నితీష్ సీటు అంటూ.. లాలూను సీట్లోంచి లేపిన అధికారులు
2015లో జరిగిన బీహార్ అసెంబ్లీ ఎన్నికల నాటి నుంచి ముఖ్యమంత్రి నితీష్ కుమార్, ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ ల మధ్య బంధం బలోపేతం అవుతూనే ఉంది. నితీష్ కు అండగా నిలిచిన లాలూ... ఆయన ముఖ్యమంత్రి అయ్యేందుకు సహకరించారు. అప్పట్నుంచి లాలూను ఏ సందర్భంలోనైనా సరే పెద్దన్నయ్యగా నితీష్ సంబోధిస్తూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో, పాట్నాలో నిన్న నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఓ ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది.
వేదికపైకి వచ్చిన లాలూ ప్రసాద్ యాదవ్... నితీష్ కోసం కేటాయించిన సీట్లో కూర్చున్నారు. వెంటనే అక్కడకు వచ్చిన అధికారులు... ఇది ముఖ్యమంత్రి కోసం ఏర్పాటు చేసిన సీటు అని, వేరే సీట్లో కూర్చోవాలని లాలూను కోరారు. ఈ చర్య ఆయనకు కొంచెం ఇబ్బందిని కలిగించినప్పటికీ, ఎలాంటి ఆగ్రహాన్ని వ్యక్తం చేయకుండా లేచి పక్కనున్న సీట్లో కూర్చున్నారు. అనంతరం వేదికపైకి వచ్చిన నితీష్ ఆయన సీట్లో కూర్చోగా, వీఐపీలకు కేటాయించిన సీట్లలో లాలూ కూర్చున్నారు.