: ఎమ్మెల్యేలున్నారు... నమ్మకం లేదు... వెలవెలబోతున్న శశికళ క్యాంప్
శశికళ చుట్టూ దాదాపు 90 మందికి పైగా ఎమ్మెల్యేలు ఉన్నారు. కానీ వారిలో తాము అండగా నిలిచిన నేత ఎంత మేరకు తమను ఆదుకుంటారన్న అనుమానాలు నెలకొన్నాయి. బయట ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి. పన్నీర్ సెల్వంకు ప్రజల మద్దతు పెరుగుతోందని తెలుస్తుంటే మనసులో గుబులు. శశికళ వర్గం కిందే ఉంటే నష్టపోతామేమోనన్న అనుమానాలు... ఇలా సాగుతున్నాయి గోల్డెన్ బే రిసార్ట్ లో గత నాలుగు రోజులుగా ఉన్న ఎమ్మెల్యేల మనోగతం. ఈ విషయాలను ఎవరూ బయటకు వచ్చి చెప్పనప్పటికీ, క్యాంపు రాజకీయాల నుంచి బయటకు వచ్చి పన్నీర్ సెల్వం వెంట చేరిన వారి మాటలు చూస్తుంటే, అదే నిజమనిపిస్తోంది.
మరోవైపు శశికళ, పోయిస్ గార్డెన్ లోనే ఉన్నప్పటికీ, నిన్న, మొన్న కనిపించినంత మంది కాదుకదా... కనీసం వేళ్లపై లెక్కించేంత మంది కూడా ఆమె ఇంటి ముందు కనిపించ లేదు. ఈ ఉదయం శశికళ నివాసం వెలవెలబోయినట్టు తమిళ మీడియాలో వార్తలు ప్రసారమయ్యాయి. ఒక్కరు కూడా లేకుండా నిర్మానుష్యంగా ఉన్న వేదనిలయాన్ని ఒకవైపు, ప్రజలు, అభిమానులతో కిక్కిరిసిన పన్నీర్ సెల్వం ఇంటిని మరోవైపు చూపుతూ వార్తా చానళ్లు ప్రత్యేక కథనాలను ప్రసారం చేస్తున్నాయి. మరింత మంది ఎమ్మెల్యేలు పన్నీర్ వైపే చూస్తున్నారని తెలుస్తోంది. ఇక నేటి సాయంత్రం రాజ్ భవన్ కు తన వర్గం ఎమ్మెల్యేలతో వెళ్లి తన బలాన్ని చూపాలని శశికళ నిర్ణయించుకున్న సంగతి తెలిసిందే.