: నేడు ఆయన ఏం చెబుతారు?... ఎంతమంది ప్రముఖులున్నా పవన్ కల్యాణ్ నామస్మరణలోనే హార్వార్డ్!

హార్వార్డ్ యూనివర్శిటీ... అమెరికాలో ప్రతిష్ఠాత్మకమైనది. ఇక ఆ వర్శిటీలో చేరే విదేశీ విద్యార్థుల పేర్లను పరిశీలిస్తే, సగం మంది భారతీయులే ఉంటారు. దివంగత రాష్ట్రపతి శంకర్ దయాళ్ శర్మ నుంచి రతన్ టాటా, చిదంబరం దాకా అదే వర్శిటీలో ఒకనాడు విద్యను అభ్యసించిన వారే. ఆ యూనివర్శిటీ ఇప్పుడు జనసేనాని, హీరో పవన్ కల్యాణ్ పేరును జపిస్తోంది. ఈ సంవత్సరం 'ఇండియా కాన్ఫరెన్స్'లో ప్రసంగించేందుకు పవన్ ఇప్పటికే అక్కడికి చేరుకున్న సంగతి తెలిసిందే. నేటి సాయంత్రం గంట సేపు ఆయన ప్రసంగం సాగనుంది.

ఇక ఇదే సమావేశాల్లో జమ్మూ కాశ్మీర్ మాజీ సీఎం ఒమర్ అబ్దుల్లా, కాంగ్రెస్ నేత శశిథరూర్, నటుడు మాధవన్, ఫ్యాషన్ డిజైనర్ మనీష్ మల్ హోత్రా, ఇండియా టీవీ ఎడిటర్-ఇన్-చీఫ్ రజత్ శర్మ, మాజీ సొలిసిటర్ జనరల్ హరీష్ సాల్వే, సిప్లా ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్ సామినా వజిరాలీలు సైతం ప్రసంగించనున్నారు. వీరందరితో పోలిస్తే, పవన్ ప్రసంగం కోసం అత్యధికులు వేచి చూస్తున్నట్టు తెలుస్తోంది.

కాగా, పవన్ 'ఇన్ స్పైర్ సిరీస్' పేరిట జరిగే కార్యక్రమంలో మాట్లాడనున్నారు. తనపై చిన్నప్పటి నుంచి ప్రభావం చూపిన అంశాలు, నటుడిగా, రాజకీయ నేతగా ఎదుగుతున్న క్రమంలో అడ్డంకులు, వాటిని దాటి సాధించిన విషయాలను తెలియజేయనున్నారు. పవన్ ప్రసంగం ఈ కాన్ఫరెన్స్ లో చిట్టచివరిది. ఇక ఆయన డీమానిటైజేషన్, కాశ్మీర్, గృహ హింస, ఇండియాలో పెట్టుబడులు తదితర అంశాలనూ ప్రస్తావించవచ్చని తెలుస్తోంది.

More Telugu News