: పన్నీర్‌నే కొనసాగించి ఉంటే బాగుండేదేమో.. శశికళతో భర్త నటరాజన్
ఎలాగైనా ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్ఠించాలన్న పట్టుదలతో ఉన్న అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి శశికళపై రోజురోజుకు వ్యతిరేకత పెరుగుతుండడంతో ఆమెలో అసహనం పెరిగిపోతోంది. గవర్నర్‌తో తాడోపేడో తేల్చుకోవాలని నిర్ణయించుకున్నారు. గవర్నర్ తీరుకు వ్యతిరేకంగా శనివారం జయ సమాధి వద్ద నిరసనకు సైతం దిగాలని భావించారు. అయితే ఆ తర్వాత మనసు మార్చుకున్నారు. శశికళపై రోజురోజుకు అన్ని వర్గాల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతుండడంతో ఆమె భర్త నటరాజన్ స్పందించారు.
ప్రస్తుత పరిస్థితుల్లో వెనక్కి తగ్గి నవ్వుల పాలవడం కంటే ముందుకు వెళ్లడమే మంచిదని సలహా ఇచ్చినట్టు తెలిసింది. అంతేకాదు ముఖ్యమంత్రి పదవి గురించి ఆలోచించకుండా కొంతకాలం పాటు పన్నీర్ సెల్వాన్నే కొనసాగించి ఉంటే ప్రస్తుత పరిస్థితి ఉత్పన్నమయ్యేది కాదని సూటిగా చెప్పినట్టు తెలిసింది. ముఖ్యమంత్రి పదవి కోసం కొంతకాలం ఆగి ఉంటే వ్యతిరేకత స్థానే సానుభూతి వచ్చి ఉండేదని, అప్పుడు ముఖ్యమంత్రి కావడం మరింత సులభమయ్యేదని పేర్కొన్నట్టు సమాచారం. అయితే ఇప్పటికే జరగాల్సిందంతా జరిగిపోయింది కాబట్టి ఇక మడమ తిప్పడం సరికాదని, ఏది ఏమైనా ముందుకే వెళ్లాలని శశికళకు సూచించారని ముఖ్యనేతలు కొందరు చెబుతున్నారు.