: అటో ఇటో తేల్చుకోవాల్సిందే.. వెనకడుగు వేస్తే నవ్వులపాలవుతాం.. శశికళ భర్త నటరాజన్
క్షణానికో మలుపు తిరుగుతున్న తమిళ రాజకీయాలు మధుబాబు 'షాడో' నవలలను తలపిస్తున్నాయి. గవర్నర్ నుంచి సానుకూల సంకేతాలు అందకపోవడంతో ముఖ్యమంత్రి రేసు నుంచి తప్పుకునేందుకు శశికళ సిద్ధమైనట్టు వార్తలు వచ్చాయి. అయితే ఆమె నిర్ణయాన్ని ఎమ్మెల్యేలతోపాటు కుటుంబ సభ్యులు కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. మీరు ఉంటేనే పరిస్థితి ఇలా ఉన్నప్పుడు ముఖ్యమంత్రిగా మరొకరిని ప్రకటిస్తే అసలుకే మోసం వచ్చే పరిస్థితి వస్తుందని ఎమ్మెల్యేలు శశికళను హెచ్చరించినట్టు తెలుస్తోంది. ‘‘వ్యక్తిగతంగా పన్నీర్ సెల్వంపై మాకు వ్యతిరేక భావం లేదు. మీరు ముఖ్యమంత్రి కావాలనే ఉద్దేశంతోనే మీకు అండగా నిలబడ్డాం’’ అని ఆమెకు వివరించినట్టు తెలుస్తోంది.
మరోవైపు శశికళ కుటుంబ సభ్యులు కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఆటను మధ్యలో వదిలేయడం సరికాదని, ఇంత జరిగాక వెనక్కి తగ్గితే నవ్వులపాలవడం ఖాయమని శశికళ భర్త నటరాజన్ పేర్కొన్నట్టు సమాచారం. గవర్నర్‌ను కనుక ఒప్పించగలిగితే వ్యతిరేకిస్తున్న ఎమ్మెల్యేలు సైతం తిరిగి పరిగెత్తుకుంటూ వస్తారని ఆయన పేర్కొన్నారు. ఇప్పటికే జరగాల్సింది జరిగిపోయిందని, ఇప్పుడు పునరాలోచించి ప్రయోజనం లేదని శశికళతో సూటిగానే చెప్పినట్టు సమాచారం.