: అన్నాడీఎంకే పార్టీలో ఉన్న చీడపురుగులు బయటపడుతున్నాయి: శశికళ
అన్నాడీఎంకే జనరల్ సెక్రటరీ శశికళ నటరాజన్ ఈ రోజు ఆ రాష్ట్ర గవర్నర్ విద్యాసాగర్ రావుకి లేఖ పంపిన అనంతరం కార్యకర్తలనుద్దేశించి మాట్లాడారు. అన్నాడీఎంకే పార్టీ కోటను ఎవ్వరూ పెకిలించలేరని ఆమె చెప్పారు. అమ్మ జయలలిత ఆశీస్సులు తమకు ఉన్నాయని అన్నారు. ఎన్నో సవాళ్లను ఎదుర్కొని దివంగత ముఖ్యమంత్రి జయలలిత అన్నాడీఎంకే పార్టీని కాపాడారని ఆమె అన్నారు. ఎంజీఆర్ మరణానంతరం పార్టీని జయలలిత కాపాడి నడిపించారని చెప్పారు. ప్రస్తుతం తమకు అలాంటి సవాళ్లే ఎదురవుతున్నాయని, ధైర్యంగా ముందుకు వెళదామని పిలుపునిచ్చారు. పార్టీని, ప్రభుత్వాన్ని తాను కాపాడతానని ఉద్ఘాటించారు. అన్నాడీఎంకే పార్టీలో ఉన్న చీడపురుగులు బయటపడుతున్నాయని, వారి ఆటలు సాగబోవని వ్యాఖ్యానించారు.