: కోహ్లీ అద్భుత ఆటతీరుకు నేనే కారణం: ఆధ్యాత్మిక గురువు గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్
టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఆ ఫార్మాట్, ఈ ఫార్మాట్ అనే తేడా లేకుండా పరుగుల వరద పారిస్తున్న సంగతి తెలిసిందే. సీనియర్ల నుంచి కొంత నేర్చుకోవడమో లేక కఠోర శ్రమతోనే లేక వైఫల్యాల నుంచి పాఠాలు నేర్చుకోవడం వల్లో విరాట్ రాటుదేలిపోయాడని చాలా మంది భావిస్తుంటారు. కానీ, ఆధ్యాత్మిక గురువు గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్ మాత్రం విరాట్ విజయానికి నేనే కారణం అంటున్నారు. తొలినాళ్లలో కోహ్లీ భారీ స్కోర్లు చేయలేక పోయేవాడని... అప్పుడు, నేర్చుకోవడం కొనసాగించాలని, ఎక్కువగా ప్రాక్టీస్ చేయాలని విరాట్ కు తను సూచించానని రామ్ రహీమ్ తెలిపారు. అప్పటి నుంచి కోహ్లీ అద్భుతంగా రాణిస్తున్నాడని కితాబిచ్చాడు. టీమిండియాకు ఎంపికైన తర్వాత కోహ్లీ తనకు కృతజ్ఞతలు తెలిపాడని చెప్పారు. ఓ బాలీవుడ్ బ్లాగ్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ విషయాలను తెలిపారు.