: 687 పరుగుల వద్ద తొలి ఇన్నింగ్స్ డిక్లేర్ చేసిన టీమిండియా
హైదరాబాదులో జరుగుతున్న టెస్టు మ్యాచ్ లో టీమిండియా భారీ స్కోరు సాధించింది. 687 పరుగుల వద్ద తొలి ఇన్నింగ్స్ ను డిక్లేర్ చేసింది. ఈ క్రమంలో ఆరుగురు బ్యాట్స్ మెన్ ను భారత్ కోల్పోయింది. మన బ్యాట్స్ మెన్ చెలరేగి ఆడటంతో స్కోరు బోర్డు పరుగులు తీసింది. భారత ఆటగాళ్లలో విరాట్ కోహ్లీ 204 పరుగులు చేసి విశ్వరూపం ప్రదర్శించగా... మురళీ విజయ్ 108, సాహా 106 (నాటౌట్) పరుగులతో బంగ్లా బౌలర్లను బెంబేలెత్తించారు. వీరికి అండగా పుజారా (83), రహానే (82), జడేజా (60), అశ్విన్ (34) పరుగులు చేశారు. ఓపెనర్ రాహుల్ మాత్రమే కేవలం 2 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద దురదృష్టవశాత్తు ఔట్ అయ్యాడు.
భారత బ్యాట్స్ మెన్లను బంగ్లా బౌలర్లు ఏ తరుణంలో కూడా ఇబ్బంది పెట్టలేక పోయారు. బంగ్లా బౌలర్లలో తైజుల్ ఇస్లాం 3, మెహెది హసన్ మిరాజ్ 2, టస్కిన్ అహ్మద్ ఒక వికెట్ తీశారు. ఈ రోజు ఆటలో మరో 12 ఓవర్లు మిగిలి ఉన్నాయి.