: జయ, శశికళ అక్రమాస్తుల ఫైళ్లను పరిశీలించిన గవర్నర్ విద్యాసాగర్ రావు

అన్నాడీఎంకే పార్టీ ప్రధాన కార్యదర్శి శశికళకు షాకుల మీద షాకులు తగులుతూనే ఉన్నాయి. ఒకవైపు తన శిబిరంలో ఉన్న ఎమ్మెల్యేలు ఒక్కొక్కరుగా జారుకుంటున్నారు. కొందరు నేరుగా పన్నీర్ సెల్వం వద్దకు వెళుతుండగా, మరికొందరు పన్నీర్ వద్దకు వెళ్లకపోయినా, ఆయనతో టచ్ లో ఉన్నారు. మరోవైపు ఈ సాయంత్రం 5 గంటలకు పన్నీర్ కు, 7.30 గంటలకు శశికళకు గవర్నర్ అపాయింట్ మెంట్ ఖరారయింది.  

మరోవైపు జయ అక్రమాస్తుల కేసు సుప్రీంకోర్టులో విచారణకు వస్తోంది. ఈ కేసులో శశికళ కూడా ఆరోపణలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. ఈ కేసులో జయతో పాటే గతంలో ఆమె జైలు జీవితాన్ని అనుభవించారు. ఈ నేపథ్యంలో జయ, శశికళల అక్రమాస్తుల కేసుకు సంబంధించిన ఫైళ్లను గవర్నర్ పరిశీలించారన్న వార్త శశికళ శిబిరంలో కలకలం రేపుతోంది. కేసు నేపథ్యంలో, శశికి వ్యతిరేకంగా రాజ్ భవన్ ఏదైనా నిర్ణయం తీసుకుంటుందేమో అనే భయం శశి వర్గీయుల్లో నెలకొంది.

More Telugu News