: డొనాల్డ్ ట్రంప్ కి మద్దతు ఇచ్చాడని భర్తకు విడాకులు ఇచ్చిన బామ్మ
కొన్ని నెలల క్రితం జరిగిన తమ దేశ అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్‌కి మద్దతు ఇచ్చినందుకు గానూ ఓ అమెరికా బామ్మ (73) తన భర్తకు విడాకులు ఇచ్చేసింది. కేవలం డొనాల్డ్ ట్రంప్ కారణంగా 20 ఏళ్ల తమ వివాహ బంధానికి గుడ్ బై చెప్పింది. తన భర్త బిల్ మెక్ కార్మిక్(77) ఆయన స్నేహితులతో కలిసి మాట్లాడుతున్న సమయంలో ట్రంప్‌కు ఓటేయాలని అనుకుంటున్నట్లు చెప్పాడని, అది విని తాను ఎంతో షాకయ్యానని బామ్మ గేల్ మెక్ కార్మిక్ చెప్పింది. ఆమె గతంలో కాలిఫోర్నియా జైలు గార్డుగా పనిచేసింది. తనతో కలిసి జైల్లో పనిచేసే బిల్కి ఆమె 1980లో పరిచయం అయింది.
డొనాల్డ్ ట్రంప్ కి మద్దతు తెలుపుతూ తీసుకున్న తన భర్త నిర్ణయం గురించి వినగానే తన గుండె బద్దలైనంత పని జరిగిందని గేల్ తెలిపింది. తన భర్తకు విడాకులు ఇవ్వడానికి ఇదే ముఖ్య కారణమని చెప్పింది. తాము ఈ నిర్ణయం అకస్మాత్తుగా తీసుకోలేదని విడిపోవాలన్న నిర్ణయం తీసుకోడానికి సుదీర్ఘంగా ఆలోచించామని, అనంతరం ఇద్దరం కౌన్సెలింగ్‌కు వెళ్లామని తెలిపింది. ప్రస్తుతం ఆ బామ్మ వాషింగ్టన్‌లోని తన సొంత అపార్టుమెంటులో ఒంటరిగా ఉంటోంది.
తన భర్తకు, తనకి మధ్య అభిరుచులు కలవకపోయినప్పటికీ ఇన్నేళ్లుగా కాపురం చేశానని, అయితే రాజకీయాల చర్చ ఎప్పుడైనా వస్తే అక్కడినుంచి లేచి వెళ్లిపోయేదాన్నని చెప్పింది. అయితే, ట్రంప్ విషయంలో మాత్రం మాట్లాడకుండా ఉండలేకపోయానని తెలిపింది. విడిపోయినప్పటికీ తన మాజీ భర్త ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలని తాను కోరుకుంటున్నట్లు ఆమె పేర్కొంది.