: స్వరం పెంచిన పన్నీర్... పోయిస్ గార్డెన్ నుంచి శశికళను తరిమేస్తానని హెచ్చరిక!
తమిళనాడు కేర్ టేకర్ సీఎం పన్నీర్ సెల్వం నుంచి కఠిన మాటలు వస్తున్నాయి. రోజురోజుకూ ఆయన స్వరం పెరుగుతోంది. శశికళపై మరోసారి నిప్పులు చెరిగారు పన్నీర్. పోయిస్ గార్డెన్ లోని అమ్మ నివాసం నుంచి ఆమెను బయటకు తరిమేస్తానని హెచ్చరించారు. చిన్నమ్మపై ఇంత కటువుగా పన్నీర్ వ్యాఖ్యానించడం ఇదే తొలిసారి. పోయిస్ గార్డెన్ లో ఉండే హక్కు ఆమెకు లేదని, ఆ ఇంటిని అమ్మ స్మారక కేంద్రంగా మారుస్తానని తెలిపారు. గవర్నర్ ఎదుట తన బలాన్ని నిరూపించుకుంటానని, కాబోయే సీఎంను తానేనని స్పష్టం చేశారు. అమ్మకు వీర విధేయురాలిగా చెప్పుకునే శశికళ, అమ్మకు ఇష్టంలేని తన కుటుంబ సభ్యులను తిరిగి ఎందుకు అక్కున చేర్చుకున్నారని ప్రశ్నించారు. అవినీతి కేసులున్న వ్యక్తుల ప్రవేశంతో పోయిస్ గార్డెన్ ను అపవిత్రం చేశారని నిప్పులు చెరిగారు. శశికళకు ధైర్యముంటే ఎమ్మెల్యేలను బయటకు పంపి, గవర్నర్ ఎదుట బలాన్ని నిరూపించుకోవాలని సవాల్ విసిరారు.