: మనసు పడి పెళ్లి చేసుకున్నాడు.. మూడేళ్ల తర్వాత ఆమెకు మరో మూడు పెళ్లిళ్లయ్యాయని తెలిసి లబోదిబో మంటున్నాడు!
ఓ యువతిని పెళ్లాడిన మూడేళ్ల తర్వాత ఆమెకు తాను ఒక్కడు మాత్రమే భర్త కాదని తెలుసుకున్న ఓ వ్యక్తి షాక్‌కు గురయిన ఘటన అహ్మదాబాద్‌లో చోటుచేసుకుంది. ఓ అందమైన యువతిని పెళ్లి చేసుకోవాలని 2013లో ఓ మేట్రిమోనియల్ సైట్‌లో సెర్చ్ చేసిన రాజుభాయ్ అనే యువకుడికి అందులో పింకీ అనే యువతి ప్రొఫైల్ కనపడింది. ఆమెపై మనసు పారేసుకొని, ఆ తర్వాత ఆమెను సంప్రదించి, ఆ యువతిని వివాహం చేసుకున్నాడు. వీరి అన్యోన్య దాంపత్యానికి చిహ్నంగా ఆ మరుసటి ఏడాదే ఓ బాబు కూడా పుట్టాడు. అయితే, తాజాగా తన భార్య ఫోన్‌లో మాట్లాడుతుండగా విన్న రాజుభాయ్.. ఆమెకు అంతకు ముందే పెళ్లిళ్లు అయ్యాయని గుర్తించాడు.
ఈ విషయంపై పింకీని నిలదీయగా, ఆమె ఆయనతో గొడవపడి ముంబైలో నివాసం ఉంటున్న తన తల్లిదండ్రుల వద్దకు వెళ్లిపోయింది. అయితే, ఇప్పుడు ఆమె రాజుభాయ్ నుంచి డబ్బులు, ఆస్తులు డిమాండ్ చేస్తోంది. తన డిమాండ్ నెరవేర్చకపోతే తమ బాబును చంపేస్తానని తన భార్య తనను బెదిరిస్తోందని రాజుభాయ్ అహ్మదాబాద్ పట్టణ పోలీసులకు తెలిపాడు. తన భార్య పింకీకి గతంలో మరో మూడు పెళ్లిళ్లు అయ్యాయని ఆయన తెలిపాడు. వారిలో ఓ భర్తతో ఇప్పటికీ చట్టపరంగా విడాకులు తీసుకోలేదని చెప్పాడు. ఆ వివరాలన్నీ తనకు చెప్పకుండానే ఆమె తనను పెళ్లి చేసుకుందని, ఇప్పుడేమో బెదిరింపులకు పాల్పడుతోందని ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.