: తమిళనాట చిందరవందర... ప్రజలకు భద్రత లేదు: సినీ నటి గౌతమి


తమిళనాడులో రాజకీయాలు చిందరవందరగా ఉన్నాయని సినీ నటి గౌతమి ఆవేదన వ్యక్తం చేశారు. చెన్నైలో ఆమె మాట్లాడుతూ, ప్రస్తుతం తమిళనాట ప్రజల తరపున పోరాడే గొంతు లేదని అన్నారు. ప్రజా భద్రతకు ముప్పువాటిల్లుతుందని ఆమె అన్నారు. తమిళనాడులో రాజకీయాలతో ఎలాంటి సంబంధం లేని ఓ వ్యక్తి అకస్మాత్తుగా నేను ముఖ్యమంత్రి అయి తీరుతానని ప్రకటించడం ప్రజాస్వామ్యానికే ముప్పు అని అన్నారు. పార్టీలో కీలక వ్యక్తి, మాజీ ముఖ్యమంత్రిగా పని చేసిన వ్యక్తి, తాను పది శాతం మాత్రమే మాట్లాడానని, 90 శాతం మాట్లాడితే కొందరి అసలు రంగులు బయటపడతాయని చేసిన వ్యాఖ్యలు ఎంత భయంకరమైనవో అర్ధం చేసుకున్నవారికి తెలుస్తుందని ఆమె చెప్పారు. ప్రజాస్వామ్యం గొంతు నొక్కడాన్ని ఏ తమిళుడు అంగీకరించడని అన్నారు. జయలలితను చూసి ఓట్లు వేశారని ఆమె తెలిపారు.

ఆవిడకు వేసిన ఓటు ఫలితాన్ని తాము అనుభవిద్దామని కొందరు భావిస్తున్నారని ఆమె పేర్కొన్నారు. బాధ్యతాయుత రాజకీయాలు లేనప్పుడు, ప్రజాసమస్యలు పట్టించుకోనప్పుడు ప్రశ్నించే బాధ్యత పౌరురాలిగా ఉందని ఆమె స్పష్టం చేశారు. తాను రాజకీయాల్లో ఉంటానా? లేదా? అన్నది సమస్య కాదని, వాస్తవాలను పక్కదోవ పట్టించేందుకు లేనిపోని వాదనలు తెరమీదికి తెస్తున్నారని ఆమె మండిపడ్డారు. జయలలిత ఆసుపత్రిలో ఉండగా ప్రభుత్వం తరపున నిర్ణయాలు ఎవరు తీసుకున్నారు? అని ఆమె ప్రశ్నించారు. ఒక వైపు జయలలిత అంతిమ శ్వాసవరకు పక్కనే ఉండి సేవలు చేశామని చెప్పుకునేవారు (శశికళ). ప్రభుత్వాన్ని నడిపించామని కూడా చెబుతున్నారని, అది ఎలా సాధ్యమైందని ఆమె నిలదీశారు. రాష్ట్రంలో ఏం జరుగుతుందోనని ప్రజలు తీవ్ర ఆందోళనలో మునిగిపోయారని ఆమె చెప్పారు. 

  • Loading...

More Telugu News