: శశి వర్సెస్ సెల్వం... ఎవరివైపు ఎంతమంది ఎమ్మెల్యేలు... నేడు తేలిపోతుంది!
తమిళనాడు పీఠాన్ని ఏలాలని భావించిన వీకే శశికళా నటరాజన్ పై దెబ్బ మీద దెబ్బ పడుతున్న వేళ, అనుకోని ఉపద్రవంలా నిన్న రాత్రి నుంచి జరుగుతున్న ఘటనలు ఉక్కిరిబిక్కిరి చేస్తుంటే, ఏం చేయాలో పాలుపోని స్థితిలో ఈ ఉదయం 9:30 గంటలకు పార్టీ ఎమ్మెల్యేలను సమావేశానికి పిలిచారు. జరుగుతున్న పరిణామాలతో కంగుతిన్న శశికళ వర్గంలో నిలిచివుండే ఎమ్మెల్యేల సంఖ్య ఎంత మంది వరకూ ఉంటుందన్న విషయం ఈ సమావేశానికి వచ్చే వారిని చూసిన తరువాత తేలిపోనుంది.
ఇప్పటివరకు ఆమె వర్గంలో 73 మంది వరకూ ఉన్నారన్న వార్తలు అందుతున్నాయి. ఇక వారిలో చివరి వరకూ ఎంతమంది నిలుస్తారా? అన్న ప్రశ్నలూ ఉన్నాయి. తమిళనాడులో ప్రభుత్వం ఏర్పాటై సంవత్సరం కూడా కాలేదు. ఇంకా నాలుగేళ్ల పాటు అధికారంలో ఉండవచ్చు. ఈ నేపథ్యంలో ఇప్పటికిప్పుడు అధికారాన్ని కోల్పోయి విపక్షంలో కూర్చోవడానికి లేదా మరోసారి ఎన్నికలకు వెళ్లడానికి వీరిలో ఎక్కువ మంది అంగీకరించడం లేదని సమాచారం. శశికళ వర్గం ఎమ్మెల్యేల్లో కొందరు మరికొంత కాలం వేచి చూద్దామన్న భావనలో ఉన్నారని తెలుస్తోంది. ఏదిఏమైనా, శశికళ వర్సెస్ పన్నీర్ సెల్వం మధ్య జరుగుతున్న ఈ హోరాహోరీ పోరులో ఎవరి వెనుక ఎవరు నిలుస్తారన్న విషయమై నేడు స్పష్టత రానుంది.