: తెలంగాణ ఐపీఎస్ అధికారి సీవీ ఆనంద్ నా పాత్రకు స్ఫూర్తి : నటుడు సూర్య
దక్షిణాది నటుడు సూర్య నటించిన తాజా చిత్రం ‘సింగం-3’ త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో మీడియాతో సూర్య మాట్లాడాడు. ఈ చిత్రంలోని నరసింహం పాత్రకు స్ఫూర్తి ఎవరు? అనే ప్రశ్నకు ఆయన సమాధానమిస్తూ, తెలంగాణ ఐపీఎస్ అధికారి సీవీ ఆనంద్ ని స్ఫూర్తిగా తీసుకుని ఈ పాత్ర చేయడం జరిగిందన్నాడు. సిన్సయర్ పోలీస్ అధికారిగా విశిష్ట సేవలు అందిస్తున్న ఆయన, పోలీస్ శాఖలో పలు విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టారన్నాడు.
సీవీ ఆనంద్ చేసిన సేవలకు గాను రాష్ట్రపతి పురస్కారం దక్కిందని, ఆయన వృత్తి నిర్వహణలో ఎదుర్కొన్న సవాళ్లను తమ చిత్రంలో నరసింహం పాత్రకు ఎంతో స్ఫూర్తిగా నిలిచాయన్నాడు. ఎవరైతే నిజాయతీగా తమ వృత్తి ధర్మాన్ని నిర్వర్తించి రాష్ట్రపతి పతకాన్ని సాధించారో, వారందరికీ గౌరవాన్ని తెచ్చి పెట్టే చిత్రం ‘సింగం’ అని అన్నారు. ఐదు భాషల్లో రీమేక్ చేసిన సింగం సినిమాను మహారాష్ట్ర పోలీస్ అకాడమీ వారు అక్కడ శిక్షణ పొందుతున్న వారికి చూపిస్తుండటం తనకు దక్కిన గౌరవంగా భావిస్తున్నానని సూర్య సంతోషం వ్యక్తం చేశారు.