: ఎక్కడ మొదలు పెట్టాలో.. ఎక్కడ ముగించాలో నాకు తెలుసు: ‘ఎన్టీఆర్’ సినిమాపై బాలయ్య
దివంగత ముఖ్యమంత్రి, సినీనటుడు ఎన్టీఆర్ జీవిత చరిత్రపై సినిమా తీస్తామని నందమూరి బాలకృష్ణ ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే. అందులో ఎన్టీఆర్ చరిత్రను వక్రీకరించకూడదని పలువురు చేస్తోన్న సూచనలపై బాలయ్య స్పందించారు. ఈ రోజు ఆయన విజయవాడలో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ... ఎన్టీఆర్ జీవిత చరిత్రను ఎక్కడ మొదలు పెట్టాలో.. ఎక్కడ ముగించాలో తనకు తెలుసని అన్నారు.
ప్రజలకు ఆయన గొప్పదనాన్ని చెప్పాల్సిన బాధ్యత తమపై ఉందని అన్నారు. ఎన్టీఆర్ గురించి ప్రజలకు తెలిసిన విషయాలతో పాటు తెలియని అంశాలని కూడా చూపిస్తామని అన్నారు. ఈ సినిమాకి దర్శకత్వం ఎవరు వహిస్తారన్న విషయంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని చెప్పారు. ఇది పెద్ద కమర్షియల్ సినిమా కాదని అన్నారు. ఎన్టీఆర్ పాత్ర మాత్రం తానే చేస్తానని అన్నారు. ఆయనో మహానుభావుడని చెప్పారు. ఆయన ఇచ్చిన స్ఫూర్తితోనే తాను నిజజీవితంలో నడుచుకుంటున్నానని అన్నారు.