: తన ట్వీట్ విపరీతంగా వైరల్ అవుతుండడంతో స్పందించిన క్రికెటర్ అశ్విన్
తమిళనాడు రాజకీయ పరిస్థితులు ఉత్కంఠగా మారిన నేపథ్యంలో క్రికెటర్ రవిచంద్రన్ ఆశ్విన్ ఈ రోజు చేసిన ఆసక్తికర ట్వీట్ విపరీతంగా వైరల్ అయిన విషయం తెలిసిందే. "తమిళనాడులోని అందరు యువకులకూ... త్వరలో 234 ఉద్యోగ అవకాశాలు రానున్నాయి" అని ఆయన తన ట్వీట్లో పేర్కొన్నాడు. అయితే ఒక్కసారిగా తన ట్వీట్ విపరీతంగా షేర్లు సంపాదిస్తుండడంతో అశ్విన్ మరోసారి ఆ ట్వీట్ పై స్పందించాడు. తన ఉద్దేశం అది కాదని అన్నాడు.
'గైస్... ప్లీస్ కూల్ ఇట్ డౌన్' అని పేర్కొంటూ తన ట్వీట్ ఉద్యోగాల కల్పనకు సంబంధించిన డ్రైవ్ మాత్రమేనని అన్నాడు. అంతేగాని రాజకీయాలతో ఎలాంటి సంబంధం లేదని అశ్విన్ మరో ట్వీట్ చేశాడు. ఈ ట్వీట్ పై అశ్విన్ మేనేజర్ వి.బాలాజీ కూడా స్పందిస్తూ అశ్విన్ క్రికెట్ ఇన్‌స్టిట్యూషన్, అశ్విన్ ఫౌండేషన్ ద్వారా ఉద్యోగాలు కల్పించనున్నామన్నదే ఆ ట్వీట్ ఉద్దేశమని చెప్పారు.