: ఈ ప్రాంతంలో ప్రాజెక్టుల కోసం ఒక్క ఇటుక పెట్టిన పాపాన పోలేదు: చంద్రబాబుపై జగన్ నిప్పులు
అనంతపురం జిల్లా కరవు కాటకాలకు పుట్టినిల్లుగా ఉందని ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి అన్నారు. అనంతపురం జిల్లాలోని హంద్రీనీవా ద్వారా ఆయకట్టుకు సాగునీటిని కేటాయించాలని డిమాండ్ చేస్తూ ఈ రోజు ఉరవకొండలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన మహాధర్నాలో ఆయన పాల్గొని మాట్లాడారు. గతంలోనూ చంద్రబాబు నాయుడు 9 ఏళ్లు పరిపాలించారని, ఆయన ఈ ప్రాంతానికి కేటాయిస్తోన్న నిధులు ఏ మాత్రం సరిపోవడం లేదని జగన్ ఆరోపించారు. ఈ ప్రాంతంలో ప్రాజెక్టుల కోసం ఒక్క ఇటుక పెట్టిన పాపాన పోలేదని ఆయన విమర్శించారు.
చంద్రబాబు నాయుడు ఎన్నికలున్నప్పుడల్లా ఈ ప్రాంతానికి వస్తున్నారని, అనంతరం అనంతపురాన్నే మరచిపోతున్నారని ఆయన అన్నారు. ఇదే ఉరవకొండ వద్దకు వచ్చి గతంలో చంద్రబాబు నాయుడు ఎన్నో హామీలు కురిపించారని ఆయన అన్నారు. ఇక్కడ హంద్రీనీవా ప్రాజెక్టుకు ఎన్నడో శంకుస్థాపన చేశారని, ఇప్పటికీ ఇదే ప్రాజెక్టుకి రెండు సార్లు శంకుస్థాపన చేశారని ఆయన వ్యాఖ్యానించారు. ఇప్పుడు ఎన్నికలు లేవు కాబట్టి, ఇక ఇక్కడి ప్రజలతో, హంద్రీనీవా ప్రాజెక్టుపై తనకేం పని అని చంద్రబాబు నాయుడు అనుకుంటున్నారని జగన్ ఆరోపించారు.