: 5జీ కన్నా 10 రెట్లు వేగంగా డేటాను అందించే టెరాహెర్జ్ ట్రాన్స్ మీటర్ వచ్చేస్తోంది!


జపాన్ కు చెందిన రీసెర్చర్లు మరో అద్భుత ఆవిష్కరణ దిశగా అడుగులు వేస్తున్నారు. ఐదవ తరం మొబైల్ నెట్ వర్క్ (5జీ)తో పోలిస్తే, 10 రెట్లు ఎక్కువగా డేటా ట్రాన్స్ ఫర్ సామర్థ్యాన్ని కలిగుండే టెరాహెర్జ్ (టీహెచ్) ట్రాన్స్ మీటర్ ను అభివృద్ధి చేశారు. మరో మూడేళ్లలో, అంటే 2020 నాటికి ఈ టీహెచ్ సాంకేతికత అందుబాటులోకి రానుంది. ఈ టెక్నాలజీతో ఓ డీవీడీలోని సమాచారాన్ని సెకను కన్నా తక్కువ సమయంలోనే ట్రాన్స్ ఫర్ చేయవచ్చు. అమెరికాలోని శాన్ ఫ్రాన్సిస్కోలో, ఆదివారం నాడు 'ఇంటర్నేషనల్ సాలిడ్ స్టేట్ సర్క్యూట్స్ కాన్ఫరెన్స్' ప్రారంభంకాగా, జపాన్ లోని హిరోషిమా యూనివర్శిటీ ప్రొఫెసర్ మినోరు ఫుజిషిమా ఈ కొత్త సాంకేతికత వివరాలను వెల్లడించారు. భవిష్యత్తులో అందుబాటులోకి వచ్చే అల్ట్రా హై స్పీడ్ వైర్ లెస్ కమ్యూనికేషన్ వ్యవస్థకు ఈ టీహెచ్ టెక్నాలజీ ఉపకరిస్తుందని అన్నారు. శాటిలైట్ల నుంచి సమాచారం, మరింత వేగవంతమైన డౌన్ లోడ్లు, ఫ్లయిట్ నెట్ వర్క్, బేస్ స్టేషన్ల మధ్య వైర్ లెస్ లింక్స్ తదితరాలెన్నో దీంతో ప్రభావితమవుతాయని అన్నారు.

తమ పరిశోధనల్లో భాగంగా 290 నుంచి 315 గిగాహెర్జ్ ఫ్రీక్వెన్సీలో సెకనుకు 105 గిగాబైట్ల వేగాన్ని అందుకున్నామని మినోరు వెల్లడించారు. ఈ ఫ్రీక్వెన్సీలను ఇప్పటివరకూ ఎవరికీ కేటాయించలేదని, వీటి వాడకంపై 2019లో జరిగే డబ్ల్యూఆర్ సీ (వరల్డ్ రేడియో కమ్యానికేషన్ కాన్ఫరెన్స్)లో చర్చించనున్నామని అన్నారు. ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్ ఆధారిత ట్రాన్స్ మిటర్ వ్యవస్థలో తొలిసారిగా సెకనుకు 100 జీబీ డేటా ట్రాన్స్ ఫర్ ను తాము సాధించామని ఆయన తెలిపారు. ఈ సంవత్సరం డేటా వేగాన్ని మరింతగా పెంచేలా పరిశోధనలు సాగుతున్నాయని తెలిపారు. ఇప్పటివరకూ మెగాబైట్లు, గిగాబైట్ల గురించి మాత్రమే మాట్లాడుకుంటున్నామని, ఇకపై టెరాబైట్ల గురించి మాట్లాడే సమయం వచ్చిందని ఆయన అన్నారు. కాగా, ఈ పరిశోధనలకు జపాన్ నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్స్ టెక్నాలజీ, పానాసోనిక్ కార్పొరేషన్ లు సహకారాన్ని అందిస్తున్నాయి. 

  • Loading...

More Telugu News