: మళ్లీ మాజీ అయిపోయిన పన్నీర్ సెల్వం.. రాజీనామాను ఆమోదించిన గవర్నర్
తమిళనాడు ముఖ్యమంత్రి పదవికి పన్నీర్ సెల్వం చేసిన రాజీనామాను ఆ రాష్ట్ర తాత్కాలిక గవర్నర్ విద్యాసాగర్ రావు ఆమోదించారు. ఆ విషయాన్ని చెన్నైలోని రాజ్ భవన్ వర్గాలు వెల్లడించాయి. దీంతో, పన్నీర్ మరోసారి మాజీ సీఎం అయిపోయారు. తన పదవికి నిన్న రాజీనామా చేశారు పన్నీర్. వ్యక్తిగత కారణాల వల్లే తాను రాజీనామా చేస్తున్నానని రాజీనామా లేఖలో తెలిపారాయన. దివంగత జయలలితకు అత్యంత విశ్వాసపాత్రుడైన పన్నీర్ సెల్వం... సీఎం పీఠంపై జయ కూర్చోలేని పరిస్థితులు తలెత్తినప్పుడల్లా ముఖ్యమంత్రిగా వ్యవహరించారు. ఆమెకు లైన్ క్లియర్ కాగానే, ఎంతో విశ్వాసంతో మళ్లీ జయకు సీఎం పదవిని అప్పగించేవారు. అప్పుడు అమ్మ కోసం చేసింది, ఇప్పుడు చిన్నమ్మ కోసం చేశారాయన. జయ మరణం తర్వాత సీఎం పగ్గాలు చేపట్టిన పన్నీర్ సెల్వం, శశికళ కోసం తన పదవిని త్యాగం చేశారు. అయితే, శశి వర్గం ఒత్తిడి తట్టుకోలేకే ముఖ్యమంత్రి పదవికి పన్నీర్ రాజీనామా చేశారనే వార్తలు వెల్లువెత్తుతున్నాయి.