: సెల్ఫీ కోసం కొండ ఎక్కి ప్రాణాలు కోల్పోయిన యువకుడు!
సెల్ఫీల మీద ఉన్న మోజుతో మరో యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. ప్రమాదకరమైన ప్రదేశాల్లో సెల్ఫీ తీసుకుని అందరికీ చూపించుకోవాలనుకున్న యువకులు చివరికి తమ ప్రాణాలు కోల్పోతున్న ఘటనలు ఎన్నో వెలుగులోకి వస్తున్నా ఇటువంటి ఘటనలు మళ్లీ పునరావృతం అవుతుండడం గమనార్హం. డెహ్రాడూన్‌లో మన్‌దీప్, మునీర్ అహ్మద్ అనే ఇద్దరు స్నేహితులు టూర్‌కోసం ముస్సోరి బయలుదేరారు. పలు ప్రదేశాల్లో ఫొటోలు దిగుతూ ఉత్సాహంగా గడుపుతున్నారు. ఈ క్రమంలోనే కోలుకేట్ అనే గ్రామంవద్ద 50 అడుగుల ఒక కొండను చూశారు. దానిపైకి ఎక్కి తమ చుట్టూ ఉన్న పరిసరాలు కవరయ్యేలా, వెనక్కి జరిగి సెల్ఫీ తీసుకుంటుండగా మునీర్ అహ్మద్ కొండ పై నుంచి కింద పడ్డాడు. తోటి స్నేహితుడు అక్కడే ఉన్న గ్రామస్తులకు ఈ సమాచారం అందించి, వారిని అక్కడకు తీసుకొచ్చాడు. అయితే అప్పటికే అహ్మద్ ప్రాణాలు కోల్పోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకొని విచారణ చేపట్టారు.