: రజనీకాంత్ సంచలన వ్యాఖ్యలు.. తమిళనాడులో ప్రకంపనలు.. వివరణ ఇచ్చిన సూపర్ స్టార్!
సూపర్ స్టార్ రజనీకాంత్ చేసిన వ్యాఖ్యలు తమిళనాడులో సంచలనం సృష్టిస్తున్నాయి. కొందరిలో కలవరం పుట్టిస్తున్నాయి. రాజకీయాలపై తనకు ఆసక్తి లేదని గతంలో పలుమార్లు పేర్కొన్న ఆయన తాజాగా ‘పవర్ అంటే ఇష్టమే’నని పేర్కొనడం సంచలనంగా మారింది. రజనీకాంత్ త్వరలో రాజకీయ రంగ ప్రవేశం చేయనున్నారనే దానికి ఆయన తాజా వ్యాఖ్యలు సంకేతమని చెబుతున్నారు. అంతేకాదు, బీజేపీ మద్దతుతో సొంతంగా రాజకీయ పార్టీ కూడా ప్రారంభించనున్నారనే ఊహాగానాలు ఇప్పుడు తమిళనాడులో ఊపందుకున్నాయి.
జయలలిత మృతి తర్వాత రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులపై రజనీకాంత్ తీవ్ర అసంతృప్తితో ఉన్నారని చెబుతున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఏర్పడిన రాజకీయ శూన్యాన్ని భర్తీ చేయడం ఒక్క రజనీ వల్లే సాధ్యమవుతుందని అభిప్రాయపడుతున్నారు. పన్నీర్‌ను ముఖ్యమంత్రి పదవి నుంచి చాకచక్యంగా తప్పించిన శశికళ సీఎం పగ్గాలు చేపట్టేందుకు సిద్ధమైన నేపథ్యంలో రజనీకాంత్ రాజకీయాల్లోకి రావాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆయన అభిమానులు చెబుతున్నారు. అంతేకాదు, రజనీ రాజకీయాల్లోకి రావాలంటూ పెద్ద ఎత్తున సందేశాలు సైతం పంపుతున్నారు.
తన రాజకీయ రంగ ప్రవేశంపై వెల్లువలా వచ్చిపడుతున్న సందేశాలు, విస్తృతంగా ప్రచారమవుతున్న ఊహాగానాలతో ఉక్కిరిబిక్కిరి అయిన రజనీకాంత్ తర్వాత స్పందించారు. తను పేర్కొన్న ‘పవర్’ ఆధ్యాత్మికతకు సంబంధించినదంటూ వివరణ ఇచ్చారు. ఆధ్యాత్మిక దృష్టితో ఆ మాటను అన్నాను తప్పితే రాజకీయ ఉద్దేశంతో కాదని వివరణ ఇచ్చారు. డబ్బు, కీర్తి.. ఈ రెండింటిలో ఏది కావాలని అడిగితే తను ఆధ్యాత్మికతనే ఎంచుకుంటానని తేల్చిచెప్పారు. దానికే అంత శక్తి (పవర్) ఉంటుందని పేర్కొన్నారు. తాను ఆ ఉద్దేశంతోనే అన్నాను తప్పితే రాజకీయ కోణంలో కాదని, తన మాటలను మరోలా తీసుకోవద్దని అభిమానులను కోరారు.