: అధునాతనం.. అమరావతి అసెంబ్లీలో ఎన్నెన్నో విశేషాలు!
- జర్మనీ సాంకేతికతతో సౌండ్ సిస్టమ్
- ఆరు అడుగుల ఎత్తులో స్పీకర్ పోడియం
- సభ్యులకు విలాసవంతమైన పుష్ బ్యాక్ సీట్లు
అత్యాధునిక ఇంటీరియర్ డిజైన్ తో అసెంబ్లీకి హంగులద్దారు. విదేశాల నుంచి తెప్పించిన కార్పెట్, లేపాక్షి హస్తకళల విభాగం అధికారులు దగ్గరుండి తయారు చేయించిన ఫర్నీచర్ అసెంబ్లీకి ప్రత్యేకం. ముఖ్యమంత్రి, విపక్ష అధినేతలు కూర్చునేందుకు ప్రత్యేక కుర్చీలను ఏర్పాటు చేయించారు. సభ్యులు స్పీకర్ స్థానాన్ని చేరుకోలేని విధంగా ఏర్పాట్లు చేశారు. గతంలో జరిగిన పరిణామాలను దృష్టిలో ఉంచుకుని ఈ తరహా ఏర్పాట్లు చేసినట్టు అధికారులు తెలిపారు. మంత్రులు, ఎమ్మెల్యేల కోసం పుష్ బ్యాక్ సీట్లు ఏర్పాటు చేశారు. ముందుకూ, వెనక్కూ జరిగేలా కుర్చీ సీట్లను అమర్చారు. సెన్సార్ మైక్ విధానాన్ని బ్రిటన్ తో పాటు మన దేశంలోని కేరళలో అమలు చేస్తుండగా, దాన్ని పరిశీలించి వచ్చి అదే తరహా టెక్నాలజీని ఇక్కడా వాడారు. జర్మనీ సాంకేతికతతో తయారు చేసిన మైకులను తీసుకువచ్చి అమర్చారు.
ఇక సందర్శకుల కోసం ఐదు చాంబర్ల గ్యాలరీ సిద్ధమైంది. ఇక్కడ ఆహ్వానితులు, మీడియా ప్రతినిధులు కూర్చునేందుకు సౌకర్యవంతమైన ఏర్పాట్లు చేశారు. సౌండ్ డిస్ట్రబెన్స్ లేకుండా చూసేందుకు చుట్టూ ప్రత్యేక ఉడ్ తో గోడలు, ఫ్లోరింగ్ ను, సభ్యులు మాట్లాడే విషయాలు అందరికీ వినిపించేలా స్పీకర్ల ఏర్పాటు ఉన్నాయి. అసెంబ్లీ భవనం ఎలా తయారైందో, అంతే సౌకర్యవంతంగా మండలి భవనమూ సిద్ధమైంది.