: స్టార్టప్ కంపెనీలకు 20 శాతం హెచ్1-బీ వీసాలు.. కనీసం 50 మంది ఉద్యోగులు లేని కంపెనీలకు వీసాలు బంద్!: యూఎస్ వీసా బిల్లు ముఖ్యాంశాలు


అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ప్రతినిధుల సభలో ప్రవేశపెట్టిన హెచ్-1బీ వేతన సవరణ బిల్లుపై తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. అత్యధిక భారత టెక్కీలు వినియోగించే ఈ వీసాల బిల్లు అమల్లోకి వస్తే, భారత ఐటీ రంగానికి శరాఘాతమేనని విశ్లేషకులు పేర్కొన్నారు. ఈ బిల్లులోని అంశాల ప్రకారం, హెచ్‌–1బీ వీసాలపై అమెరికాలో పనిచేస్తున్న విదేశీ ఉద్యోగుల వేతనాన్ని రెండింతలు పెంచాల్సి ఉంటుందన్న సంగతి తెలిసిందే. అలా చేయలేకుంటే, తప్పనిసరిగా అమెరికన్లనే నియమించుకోవాలి. ఇక 50 కన్నా తక్కువ మంది ఉద్యోగులు ఉంటే, ఒక్క వీసాను కూడా జారీ చేయబోరు. స్టార్టప్ సంస్థగా ఉన్న కంపెనీల కోసం 20 శాతం వీసాలను కేటాయించాలని బిల్లులో పేర్కొన్నారు.

"ది హై స్కిల్డ్‌ ఇంటిగ్రిటీ అండ్‌ ఫెయిర్‌నెస్‌ యాక్ట్‌ 2017" పేరిట బిల్లు తయారుకాగా, కాలిఫోర్నియా కాంగ్రెస్‌ సభ్యురాలు జోయ్‌ లోఫ్‌ గ్రెన్‌ ఈ వారం ప్రారంభంలో యూఎస్ ప్రతినిధుల సభలో దీన్ని ప్రవేశపెట్టిన సంగతి విదితమే. హెచ్‌–1బీ వీసాపై అమెరికాలో పనిచేస్తున్న వారికి ఏడాదికి కనీసం 1.30 లక్షల డాలర్లు (దాదాపు రూ. 88 లక్షలు) చెల్లించాలన్న నిబంధన, నైపుణ్యమున్న భారత ఐటీ ఉద్యోగులకు ఓ రకంగా వరమే అయినప్పటికీ, సెమీ స్కిల్డ్ వర్కర్ల అమెరికా ఆశలకు విఘాతమే. ఏకంగా ఇప్పుడున్న 60 వేల డాలర్ల వేతనంపై 200 శాతం అదనంగా చెల్లించేందుకు సిద్ధంగా ఉన్న కంపెనీలకే మార్కెట్‌ ఆధారంగా వీసాలు కేటాయించాలని ఈ బిల్లులో ఉంది.

ఇక ఉద్యోగుల సంఖ్య 50 కన్నా తక్కువగా ఉంటే, ఆ కంపెనీలకు ఇచ్చే 20 శాతం వీసా కోటను కూడా తొలగిస్తూ బిల్లులో ప్రతిపాదన ఉంది. కంపెనీలో ఖాళీలు ఏర్పడితే, తప్పనిసరిగా అమెరికన్లను పరిగణనలోకి తీసుకోవాలి. కొత్త చట్టం అమలులో తేడాలు వస్తే, విచారించి, కేసులు పెట్టేందుకు హోం ల్యాండ్ భద్రతా విభాగానికి అదనపు అధికారాలను కూడా కట్టబెడుతున్నట్టు తెలిపారు. ఇక తప్పు చేసిన కంపెనీలపై ప్రస్తుతం విధిస్తున్న జరిమానాలను కూడా భారీగా పెంచుతూ నిర్ణయాలు తీసుకున్నారు. అత్యంత ప్రతిభావంతులను ఉద్యోగాల్లో నియమించుకునే విషయంలో బిల్లు సహకరిస్తుందని, ఇదే సమయంలో తక్కువ వేతనాలకు విదేశీ ఉద్యోగులను తెచ్చి, అమెరికాలో నిరుద్యోగాన్ని పెంచుతున్న కంపెనీలకు చెక్ పడుతుందని బిల్లును ప్రవేశపెడుతున్న సందర్భంగా లోఫ్‌ గ్రెన్‌ వ్యాఖ్యానించారు.

  • Loading...

More Telugu News