: చంద్రబాబును దెబ్బకొట్టేందుకు పవన్ తో దోస్తీ: వైకాపా నేత విజయసాయి రెడ్డి
చంద్రబాబునాయుడిని అధికారానికి దూరం చేయడమే లక్ష్యంగా, 2019లో రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో పవన్ కల్యాణ్ స్థాపించిన జనసేన పార్టీతో పొత్తు పెట్టుకునే అంశంపై వైకాపా నుంచి సానుకూల సంకేతాలు వచ్చాయి. బాబును అడ్డుకునేందుకు జనసేన సహా, సీపీఐ, సీపీఎం తదితర భావ సారూప్యమున్న పార్టీలతో పొత్తుకు సిద్ధమని ఆ పార్టీ నేత, ఎంపీ విజయసాయి రెడ్డి ప్రకటించారు. ఏపీకి ప్రత్యేక హోదా సాధన క్రమంలో తమతో ఎవరు కలిసి వచ్చినా స్వాగతిస్తామని, వారితో కలసి పోరాడేందుకు సిద్ధమని ఆయన అన్నారు.
కాంగ్రెస్ పార్టీ ఏపీకి తీరని ద్రోహం చేసిందని, భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీని ఏపీ ప్రజలు ఎన్నడూ విశ్వసించే అవకాశం లేదని, అటువంటి ద్రోహం చేసిన పార్టీతో తాము సంబంధాలు పెట్టుకోబోమని, బీజేపీతో సంబంధాలకు తాము సిద్ధంగా లేమని, పెట్టుకోవాలంటే గతంలోనే ఆఫర్ వచ్చిందని ఆయన అన్నారు. ఇదే సమయంలో ప్రత్యేక హోదా కోసం పోరాడుతున్న జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్, తమతో చేతులు కలిపితే సంతోషమని అన్నారు. తమ పోరాటాన్ని సమర్థించేవారిని ఎప్పుడైనా స్వాగతిస్తామని, వారితో కలసి పోరాటం చేస్తామని చెప్పుకొచ్చారు.