: మరో వివాదాస్పద ఆదేశానికి సిద్ధమవుతున్న ట్రంప్.. మత ప్రాతిపదికగానే సేవలు!
డొనాల్డ్ ట్రంప్.. ఇప్పుడీ పేరు వింటేనే ప్రపంచ దేశాలు ఉలిక్కి పడుతున్నాయి. ఆయన నోటి నుంచి ఎప్పుడు ఎటువంటి ప్రకటన వస్తుందోనని వణుకుతున్నాయి. ముఖ్యంగా ఇస్లామిక్ దేశాలకు అమెరికా అధ్యక్షుడు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నారు. ఇప్పటికే ఏడు ముస్లిం మెజారిటీ దేశాలపై ట్రావెల్ బ్యాన్ విధించిన ట్రంప్, ఇప్పుడు మరో వివాదాస్పద ఆదేశం జారి చేసేందుకు సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. 'మత స్వేచ్ఛను గౌరవించేందుకు ప్రభుత్వ చొరవ' పేరుతో ఆదేశం ముసాయిదా కూడా తయారైనట్టు స్థానిక పత్రికలు పేర్కొన్నాయి. అదే జరిగితే వ్యక్తులు, సంస్థలు, మత ప్రాతిపదికన ఉద్యోగాలను, సేవలను, ఇతర ప్రయోజనాలను నిరాకరించవచ్చని తెలిపాయి.
కొన్ని రకాల సేవలు అందించేందుకు మతపరమైన అభ్యంతరాలు ఉన్నాయని, వాటికి చట్టపరమైన రక్షణ కల్పించాలని మితవాద క్రైస్తవులు ఎన్నో ఏళ్లుగా డిమాండ్ చేస్తున్నారు. ట్రంప్ తాజాగా జారీచేయాలని భావిస్తున్న ఆదేశాలతో వారి డిమాండ్ నెరవేరేలా కనిపిస్తోంది. ఆదేశాలు జారీ అయితే కనుక మత స్వాతంత్ర్యం, గే హక్కుల తదితరాలపై మరోమారు పెద్ద ఎత్తున చర్చ జరిగే అవకాశాలు ఉన్నాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అంతేకాదు క్రైస్తవేతరులకు ఉద్యోగాలను నిరాకరించే అవకాశం ఉందని కూడా పత్రికలు హెచ్చరించాయి. ట్రంప్ ఆదేశాలపై విస్తృత చర్చ జరుగుతున్న నేపథ్యంలో వైట్‌హౌస్ సెక్రటరీ సీన్ స్పైసర్ స్పందిస్తూ అటువంటి ఆదేశాలు జారీ చేసే ఆలోచన ట్రంప్ కు లేదని కొట్టిపడేశారు.