: దాసరి గారు పూర్తి మానసిక ఆరోగ్యంతో కనిపించారు.. చాలా ఆనందంగా ఉంది: ఆసుపత్రి వద్ద చిరంజీవి


కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ప్రముఖ దర్శకుడు దాసరి నారాయణరావు పూర్తి మానసిక ఆరోగ్యాన్ని సంతరించుకున్నారని ప్రముఖ నటుడు చిరంజీవి తెలిపారు. హైదరాబాదులోని కిమ్స్ లో దాసరిని పరామర్శించిన అనంతరం ఆయన మాట్లాడుతూ, 'ఖైదీ నెంబర్ 150 సినిమా ధ్యాంక్స్ గివింగ్ ఫంక్షన్ నిర్వహించాలనుకుంటున్నాము... మీ ఆశీస్సులు కావాల'ని కోరగానే.. ఆయన సంతోషం వ్యక్తం చేశారని చెప్పారు. అంతే కాకుండా తనకు అభినందనలు చెప్పారని, సినిమా ఎలా ఆడుతోందో అడిగి తెలుసుకున్నారని అన్నారు.

'ఫంక్షన్ కు వచ్చి మాట్లాడుతా'నని అన్నారని ఆయన తెలిపారు. అలాగే తనను 150 సినిమాలు కాదు, 250 సినిమాలు చేయాలని ప్రోత్సహించారని ఆయన చెప్పారు. దాసరి ఇలా ఆరోగ్యంతో మాట్లాడడం ఎంతో ఆనందంగా ఉందని ఆయన తెలిపారు. మరో రెండు రోజుల్లో ఆయన పూర్తి శారీరక ఆరోగ్యం సంతరించుకుని ఇంటికి తిరిగి వస్తారని ఆశిస్తున్నానని చిరంజీవి చెప్పారు. కాగా, నేడు దాసరిని సందర్శించిన వారిలో ప్రముఖ నటి జయప్రద, దర్శకుడు వీవీ వినాయక్, వైఎస్సార్సీపీ నేత అంబటి రాంబాబు, నిర్మాతలు అల్లు అరవింద్, సి.కల్యాణ్ తదితరులు ఉన్నారు. 

  • Loading...

More Telugu News