: ఒకే కక్ష్యలో 104 ఉపగ్రహాలను ఇలా ప్రవేశపెడతాం: ఇస్రో


ఈనెల 15న ఉదయం 9.07 నిమిషాలకు ప్రతిష్ఠాత్మక ప్రయోగానికి ఇస్రో సిద్ధమవుతోంది. దీనిపై ఇస్రో ప్రాజెక్టు మేనేజ్‌మెంటు కౌన్సిల్‌ ఛైర్మన్‌, స్పేస్‌ కమిషన్‌ సభ్యుడు, వీఎస్‌ఎస్‌సీ సంచాలకుడు డాక్టర్‌ శివన్‌ మాట్లాడుతూ, ఈ నెల 15న నింగిలోకి 104 ఉపగ్రహాలను ఒకే కక్ష్యలో ప్రవేశపెట్టడం సవాలేనని అన్నారు. పీఎస్‌ఎల్‌వీ-సి37 రాకెట్‌ ప్రయోగంపై ప్రపంచ వ్యాప్తంగా ఆసక్తి నెలకొందని ఆయన పేర్కొన్నారు. 104 ఉపగ్రహాలను వాహకనౌక మోసుకెళ్లడం పెద్ద కష్టమైన పని కాదని ఆయన తెలిపారు.

అయితే వాటిని ఎలాంటి ఆటంకం లేకుండా నిర్ణీత కక్ష్యలో ప్రవేశపెట్టడం సంక్లిష్టమైన ప్రక్రియ అని ఆయన తెలిపారు. అలా నిర్ణీత కక్ష్యలో ఉపగ్రహాలను ప్రవేశపెట్టే సమయంలో ఉపగ్రహాలు ఒకదానికొకటి ఢీకొనకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నామని ఆయన చెప్పారు. రాకెట్‌ నుంచి ఉపగ్రహాలు వివిధ దశల్లో విడిపోతాయని ఆయన తెలిపారు. రాకెట్‌ నుంచి విడిపోయిన ఉపగ్రహ సాపేక్ష వేగం సెకనుకు మీటరు చొప్పున ఉంటుందని, వెయ్యి సెకన్ల తర్వాత ఉపగ్రహానికి, రాకెట్‌కు మధ్య దూరం వెయ్యి మీటర్లు అవుతుందని ఆయన చెప్పారు.

అలాగే మొదట విడిపోయిన ఉపగ్రహ సాపేక్ష వేగం తర్వాత విడిపోయే దానికంటే ఎక్కువని, దీంతో వేగాల మధ్య వ్యత్యాసం వల్ల ఉపగ్రహాల మధ్య దూరం కూడా పెరుగుతుందని ఆయన చెప్పారు. ఈ ఉపగ్రహాలు పరిభ్రమించేది మాత్రం ఒకే కక్ష్యలో అని ఆయన తెలిపారు. ప్రయోగానంతరం 500 కిలోమీటర్ల ఎత్తుకు రాకెట్‌ వెళ్లాక ఒక కక్ష్య పూర్తి చేసేందుకు 90 నిమిషాల సమయం పడుతుందని ఆయన తెలిపారు. ఈ 90 నిమిషాల వ్యవధిలోనే 104 ఉపగ్రహాలను వేర్వేరు సమయాల్లో సులువుగా కక్ష్యలో ప్రవేశపెట్టేందుకు ప్రయత్నిస్తున్నామని ఆయన వెల్లడించారు. ఇది కాస్త సంక్లిష్టమైన అంశమని, అంతా సజావుగా సాగుతుందని భావిస్తున్నామని ఆయన తెలిపారు. అనుకున్నట్టు అన్నీ పూర్తయితే ముందుగా నిర్ణయించినట్టు ఈనెల 15న ఉదయం ప్రయోగం జరుగుతుందని ఆయన వెల్లడించారు. 

  • Loading...

More Telugu News