: పెనుకొండ ఆర్డీవో కార్యాలయంలో ఆందోళనతో కుప్పకూలిన రైతు!
కార్ల పరిశ్రమ ఏర్పాటు నిమిత్తం సేకరించిన తన భూమికి ధర తక్కువగా వస్తుందేమోననే భయంతో ఓ రైతు గుండెపోటుతో మృతి చెందిన విషాద సంఘటన అనంతపురం జిల్లా పెనుకొండ ఆర్డీఓ కార్యాలయంలో జరిగింది. పెనుకొండ మండలం మక్కాజిపల్లి తండాలో కార్ల పరిశ్రమ ఏర్పాటు కోసం ప్రభుత్వం భూ సేకరణ చేసింది. ఆ భూముల్లో రైతు బాలు నాయక్ భూమి కూడా ఉంది. సేకరించిన భూములకు ధరలు నిర్ణయిస్తుండటంతో రైతులంతా ఆర్డీఓ కార్యాలయానికి వెళ్లారు. రైతులతో అధికారులు సంప్రదింపులు జరుపుతున్న సమయంలోనే, బాలు నాయక్ గుండెపోటుకు గురయ్యాడు. తన భూమికి ధర తక్కువగా వస్తే తన ఇద్దరు కుమార్తెల వివాహం ఎలా చేయాలనే ఆవేదనతో గుండెపోటుకు గురై ఉంటాడని తోటి రైతులు చెబుతున్నారు. బాలునాయక్ ను వెంటనే ఆసుపత్రికి తరలించినప్పటికీ ప్రయోజనం లేకుండా పోయింది. అప్పటికే ఆయన మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు.