: అవును.. అణు క్షిపణి పరీక్ష నిర్వహించాం: అంగీకరించిన ఇరాన్
ఇరాన్ క్షిపణి పరీక్షపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఇజ్రాయెల్ ప్రధాని బెంజిమెన్ నెతన్యాహూ.. తాను ఈ విషయంపై వచ్చేనెల అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను కలిసి ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపిన విషయం తెలిసిందే. అయితే, ఆ సమయంలో తమ వద్ద అసలు అణ్వాయుధాలే లేవని చెప్పిన ఇరాన్.. తాము ఓ కొత్త అణు క్షిపణి పరీక్ష నిర్వహించినట్లు తాజాగా అంగీకరించింది. తాము అణు ఒప్పందాన్ని మాత్రం ఉల్లంఘించలేదని తెలిపింది. తమ దేశంలోకి ప్రవేశించకుండా ఇటీవలే ఏడు ఇస్లామిక్ దేశాలకు చెందిన ముస్లింలపై డొనాల్డ్ ట్రంప్ ఆంక్షలు విధించిన నేపథ్యంలో ఇరాన్ క్షిపణి పరీక్షలు నిర్వహించడం ప్రాముఖ్యత సంతరించుకుంది.
ఇరాన్ మంత్రి హోసెయిన్ దెహ్గాన్ ఈ విషయంపై స్పందిస్తూ... తాము అణు కార్యక్రమానికి సంబంధించిన నిబంధనలకు గానీ, ఐక్యరాజ్యసమితి జాతీయ భద్రతా మండలి తీర్మానానికి గానీ వ్యతిరేకంగా ఏమీ చేయలేదని చెప్పారు. రెండు రోజుల క్రితం 1,010 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాన్ని ఛేదించగల క్షిపణిని ఇరాన్ పరీక్షించిందని, లక్ష్యాన్ని చేరుకున్న తర్వాత అది పేలిందని అమెరికా అధికారులు చెబుతున్నారు.