ap: ఉమ్మడి సమస్యలపై కలిసికట్టుగా పోరాడదాం: తెలుగు రాష్ట్రాల మంత్రుల నిర్ణయం
గవర్నర్ నరసింహన్ సమక్షంలో తెలంగాణ, ఏపీ మంత్రులు ఈ రోజు భేటీ అయ్యారు. ఇందులో తెలంగాణ మంత్రులు హరీశ్‌రావు, జగదీశ్‌రెడ్డి, ప్రభుత్వ సలహాదారు వివేక్, ఆంధ్రప్రదేశ్ మంత్రులు యనమల రామకృష్ణుడు, అచ్చెన్నాయుడు, ప్రభుత్వ చీఫ్ విప్ కాల్వ శ్రీనివాసులు పాల్గొన్నారు. చర్చల ఫలితంగా పలు అంశాలపై నిర్ణయం తీసుకున్నారు. ఇంతవరకు పరిష్కారం దొరకని అన్ని సమస్యలను సానుకూల ధోరణిలో చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని వారు భావించారు. సమస్యలపై కోర్టులకు వెళ్లడం కంటే పరిష్కారం దిశగా చర్చలు జరపాలని నిర్ణయించుకున్నారు.
కృష్ణా జలాలతో పాటు పలు ఉమ్మడి సమస్యలపై అవసరమైతే కలిసికట్టుగా పోరాడదామని మంత్రులు ఈ సందర్భంగా వ్యాఖ్యానించినట్లు తెలుస్తోంది. రాష్ట్ర విభజన తరువాత తలెత్తిన పరిస్థితులతో పాటు ఇతర కారణాల వల్ల ఏపీ, తెలంగాణ మధ్య నెలకొన్న సమస్యలను చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని వారు నిర్ణయం తీసుకున్నారు. అందుకోసం తాను కూడా సహకరిస్తానని గవర్నర్ అన్నట్లు తెలుస్తోంది.