: విజయమే లక్ష్యం...అసాధారణంగా పుంజుకున్న ఇంగ్లండ్
మరో రెండున్నర గంటల్లో ఇంగ్లండ్, భారత పర్యటనలో తుదిపోరు ప్రారంభం కానుంది. సిరీస్ ఆరంభం నుంచి పడుతూ లేస్తూ ఆడిన ఇంగ్లండ్ టీ20 సిరీస్ లో మాత్రం అద్భుతంగా పుంజుకుంది. ఆరంభంలో నిలదొక్కుకోవడంలో ఇబ్బందిపడ్డ ఇంగ్లండ్ జట్టు నెమ్మదిగా పుంజుకోవడం ప్రారంభించింది. టెస్టుల్లో ఘోరపరాజయం పాలైనప్పటికీ వన్డేల్లో మాత్రం భారత్ కు గట్టిపోటీ ఇచ్చింది. ఒక దశలో భారత్ పై పైచేయి సాధించింది. దానిని కొనసాగించడంలో చతికిలపడింది. టీ20 టోర్నీలో మాత్రం ఛాంపియన్ గా పేరొందిన టీమిండియాను ముప్పుతిప్పలు పెట్టి మూడు చెరువుల నీరు తాగించింది. తొలి టీ20ని నెగ్గి, రెండో టీ20లో నెగ్గబోయి ఓడింది.
ఈ నేపథ్యంలో ఫైనల్ టీ20 నేడు బెంగళూరు వేదికగా జరగనుంది. ఈ టీ20లో విజయం సాధించి, భారత్ లో ఒక టోర్నీ నెగ్గిన అనుభవాన్ని తీసుకెళ్లాలని బలంగా కోరుకుంటోంది. ఈ నేపథ్యంలో టీ20 సిరీస్ లో నైతికంగా విజయం సాధించామని ఇప్పటికే ఇయాన్ మోర్గాన్ పేర్కొన్న సంగతి తెలిసిందే. రెండో టీ20లో అపైరింగ్ నిర్ణయాలే తమను ఓటమిపాలు చేశాయని, లేని పక్షంలో విజయం సాధించింది తామేనని పేర్కొన్నాడు. అతని వ్యాఖ్యలతో విశ్లేషకులు కూడా ఏకీభవిస్తున్నారు. అయితే సాంకేతికంగా ఈ మ్యాచ్ లో ఎవరు విజయం సాధిస్తే వారినే సిరీస్ వరించనుంది. ఈ నేపథ్యంలో రెండు జట్లు మరోసారి నువ్వా? నేనా? అన్నట్టు సాగుతుందని అభిమానులు అంచనా వేస్తున్నారు.