: ఎంతో మంది లక్షాధికారులున్నా, పన్ను రాబడి అంతంతే... ఇక సహించబోమని ఆర్ధిక మంత్రి స్పష్టమైన సంకేతాలు!
ఇండియాలో ఎన్నో కోట్ల మంది వార్షిక సంపాదన రూ. 5 లక్షలకు మించి ఉండగా, వసూలవుతున్న పన్ను అతితక్కువగా ఉండటం అభివృద్ధికి విఘాతంగా ఉందని, ఈ పరిస్థితిని ఇకపై సహించబోమని ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ స్పష్టమైన సంకేతాలను ఇచ్చారు. పన్ను- జీడీపీ నిష్పత్తి చాలా తక్కువగా చెప్పుకొచ్చిన ఆయన, ప్రత్యక్ష పన్నుల వసూళ్లను క్రమంగా పెంచుతామని అన్నారు. వ్యవస్థీకృత రంగంలో 4.2 కోట్ల మంది ఉన్నప్పటికీ, 1.74 కోట్ల మంది మాత్రమే రిటర్నులు దాఖలు చేస్తున్నారని, 5 కోట్లకు పైగా కంపెనీలు రిజిస్టరై ఉండగా, అత్యధిక కంపెనీలు నష్టాలను చూపుతున్నాయని అన్నారు.
కేవలం 7,781 కంపెనీలు మాత్రమే రూ. 10 కోట్లకు మించిన లాభాన్ని చూపాయని జైట్లీ గుర్తు చేశారు. గడచిన సంవత్సరం 3.7 కోట్ల మంది రిటర్న్ లు దాఖలు చేయగా, అందులో 99 లక్షల మందికి పైగా రూ. 2.5 లక్షల లోపు ఆదాయాన్ని చూపారని, మరో 1.9 కోట్ల మంది రూ. 2.5 లక్షల నుంచి రూ. 5 లక్షలలోపు, 52 లక్షల మంది రూ. 5 లక్షల నుంచి రూ. 10 లక్షల వరకూ, 24 లక్షల మంది రూ. 10 లక్షలపైబడిన ఆదాయం చూపారని తెలిపారు. మొత్తం 76 లక్షల మంది రూ. 5 లక్షలకు పైగా ఆదాయం చూపగా, అందులో 54 లక్షల మంది ఉద్యోగులు ఉన్నారని గుర్తు చేశారు.
కానీ గత ఐదు సంవత్సరాల్లో 1.2 కోట్ల కార్లను భారతీయులు కొన్నారని, 2 కోట్ల మందికి పైగా విదేశాలకు వెళ్లి వచ్చారని, చూస్తున్న గణాంకాలకు సంబంధం లేకుండా పోయిందని జైట్లీ వెల్లడించారు. పన్నులు ఎగవేస్తున్నవారి సంఖ్య గణనీయంగా ఉందని ఈ గణాంకాలే చెబుతున్నాయని, పెద్ద నోట్ల రద్దు తరువాత 1.09 కోట్ల ఖాతాల్లో రూ. 2 లక్షల నుంచి రూ. 80 లక్షల డబ్బు డిపాజిట్ అయిందని, అంతకు మించిన నగదు 1.48 లక్షల ఖాతాల్లోకి చేరిందని గుర్తు చేశారు. పన్ను విస్తృతిని పెంచి, ఆదాయాన్ని పెంచుకోవాలని భావిస్తున్నామని, ఒక రకంగా అందుకే పెద్ద నోట్లను రద్దు చేశామని తెలిపారు. 2013-14లో రూ. 11.38 లక్షల కోట్లుగా ఉన్న నికర పన్ను ఆదాయం 2014-15లో 9.4 శాతం, 2015-16లో 17 శాతం, 2016-17లో 17 శాతం వృద్ధిని నమోదు చేసిందని అన్నారు.