: కేసీఆర్ వస్తున్నారని పోలీసుల అత్యుత్సాహం... రోగి మృతితో సూర్యాపేటలో స్థానికుల ఆగ్రహం
తెలంగాణ సీఎం కేసీఆర్ పర్యటన ఓ వృద్ధురాలి ప్రాణం తీసింది. సూర్యాపేటలో జరిగిన ఈ ఘటనతో స్థానికులు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ నిరసనలకు దిగారు. మరిన్ని వివరాల్లోకి వెళితే, కేసీఆర్ ఖమ్మం జిల్లా పర్యటనకు వెళుతున్న వేళ, సూర్యాపేటలోని మంత్రి జగదీశ్ రెడ్డి నివాసంలో కాసేపు సేదదీరేందుకు నిర్ణయించుకున్నారు. ఆయన ఇంటి పక్కనే గాయత్రీ నర్సింగ్ హోమ్ ఉండగా, అక్కడికి ప్రాణాపాయంలో ఉన్న ఓ వృద్ధురాలికి చికిత్స చేయించేందుకు కారులో ఆమె బంధువులు తీసుకు వచ్చారు. సీఎం వస్తుండటంతో, కారును ఆ వీధిలోకి వెళ్లేందుకుగానీ, రోగిని ఆసుపత్రిలోకి తీసుకు వెళ్లేందుకుగానీ పోలీసులు అనుమతించలేదు. దీంతో కారులోనే ఆమె ప్రాణాలు విడిచింది. పోలీసులు, అధికారుల నిర్లక్ష్యంతోనే ఆమె మృతి చెందిందని ఆరోపించిన స్థానికులు నిరసన చేపట్టారు.