: సహకరించలేదని చంపేశాడు... ఇన్ఫోసిస్ టెక్కీని హత్య చేసింది సెక్యూరిటీ గార్డే


పుణెలోని ఇన్ఫోసిస్ క్యాంపస్ లో ఆదివారం నాడు ఒంటరిగా పని చేసుకుంటున్న 25 ఏళ్ల ఉద్యోగిని రాసిలా రాజును హత్య చేసింది సెక్యూరిటీ గార్డు భాబెన్ సైకియానేనని పోలీసులు తేల్చారు. హత్యానంతరం తన ఇంటికి పారిపోతున్న నిందితుడిని సోమవారం నాడు ముంబైలో అరెస్ట్ చేసిన పోలీసులు అతన్నుంచి వివరాలు రాబట్టారు. అస్సోంకు చెందిన సైకియా ఆమెపై వ్యామోహం పెంచుకున్నాడని, ఒంటరిగా పని చేస్తుండటాన్ని గమనించి, ఆమె వద్దకు వెళ్లగా, ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తానని హెచ్చరించడంతోనే ఈ దారుణానికి పాల్పడ్డాడని పోలీసు వర్గాలు తెలిపాయి.

పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం, రాసిలా రాజు ఆదివారం మధ్యాహ్నం 2:30 గంటల సమయంలో ఒంటరిగా డ్యూటీకి వెళ్లింది. బెంగళూరులోని తన టీముతో కలసి పని చేసుకోవాల్సి వుండటంతో కాన్ఫరెన్స్ హాల్లో కూర్చుని ఆన్ లైన్లో విధులు నిర్వహిస్తోంది. ఆపై కాసేపటికి నిందితుడు ఆమె వద్దకు వెళ్లినప్పుడు, ఆమె హెచ్చరించి పంపింది. మరికాసేపటి తరువాత ఆమె బ్రేక్ తీసుకుని తిరిగి ఆఫీసులోకి వెళుతుండగా, సెక్యూరిటీ గార్డు ఆమెను అనుసరించాడు. ఏదో కంప్యూటర్ల గురించిన సమాచారం అడుగుతూ, ఆమె యాక్సెస్ కార్డు ద్వారానే లోపలికి వెళ్లాడు. ఆపై వారిద్దరి మధ్యా వాగ్వాదం జరిగింది.

ఆమె ముఖంపై బలంగా కొట్టిన సైకియా, ఆపై నెట్ వర్కింగ్ కేబుల్ ను ఉపయోగించి ఉరి బిగించాడు. ఆమె యాక్సెస్ కార్డును తీసుకుని బయటకు వెళ్లాడు. ఆమెను చంపిన తరువాత తానూ మరణించాలని భావించి టెర్రస్ పైకి వెళ్లానని, ఆ సమయంలో ఇంకో సెక్యూరిటీ గార్డు ఆపాడని పోలీసులు తెలిపారు. ఆపై తన తల్లికి ఫోన్ చేసి విషయాన్ని చెప్పాడని, ఆమె పోలీసులకు సరెండర్ కావాలని సలహా ఇవ్వగా, పారిపోయేందుకే ప్రయత్నించాడని తెలిపారు. నిత్యమూ బాధితురాలిని చూస్తూ, ఆమెపై వ్యామోహం పెంచుకుని ఈ దారుణానికి పాల్పడ్డాడని వెల్లడించారు. అరెస్ట్ చేసిన సైకియాను కోర్టులో ప్రవేశపెట్టగా, ఫిబ్రవరి 4 వరకూ పోలీసు కస్టడీకి న్యాయమూర్తి అనుమతించినట్టు తెలిపారు.

  • Loading...

More Telugu News