: అమ్మ చనిపోయిందని చెప్పి కిడ్నాప్ చేశాడు... అమ్మ ఎక్కడుందని ప్రశ్నిస్తే దొరికిపోయాడు!
తిరుపతిలోని యాత్రికుల వసతి సముదాయం నుంచి రెండు రోజుల క్రితం కిడ్నాపైన నాలుగేళ్ల చిన్నారి నవ్యశ్రీ ఉదంతం సుఖాంతమైన సంగతి తెలిసిందే. నిందితుడు వడ్డే బాలస్వామి బస్సులో జడ్చర్ల మీదుగా నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి వెళుతుండగా పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. ఈ పాపను బాలస్వామి ఆదివారం రాత్రి తిరుమలో కిడ్నాప్ చేసి, వెంటనే తిరుపతికి వచ్చి కర్నూలు మీదుగా మహబూబ్ నగర్ జిల్లాలోకి ప్రవేశించాడు.
ఇక ఈ బాలస్వామి ఎలా పోలీసులకు దొరికాడంటే, నిన్న జడ్చర్ల నుంచి తన స్వగ్రామానికి పాపను బస్సులో తీసుకు వెళుతున్న సమయంలో వెనుకసీటులో యాదయ్య అనే వ్యక్తి కూర్చున్నాడు. బస్సు వెళుతుండగా, చిన్నారి ఏడుస్తూ, "మా అమ్మ ఎక్కడుంది? ఏది?" అని ప్రశ్నిస్తుండేసరికి వెనకే ఉన్న యాదయ్యకు అనుమానం వచ్చింది. ఆపై పాప ఎవరని బాలస్వామిని అడిగితే, తమ పాపేనని చెప్పుకొచ్చాడు. ఇక అతని ప్రవర్తనపై వచ్చిన అనుమానంతో యాదయ్య పోలీసులకు సమాచారం ఇవ్వగా, బస్సు మిడ్జిల్ వద్దకు వచ్చేసరికి, దాన్ని ఆపి చిన్నారిని పోలీసులు రక్షించారు.
ఈ సందర్భంగా పోలీసులు అడిగిన పలు ప్రశ్నలకు చిన్నారి చక్కగా బదులిచ్చింది. తాను తగరకుంటలోని రోహిత్ ఇంగ్లీష్ మీడియం స్కూలులో ఎల్కేజీ చదువుతున్నానని, మీ అమ్మ చనిపోయిందని చెప్పి తనను ఇక్కడికి తీసుకు వచ్చారని పోలీసులకు చెప్పింది. ఇక బాలస్వామికి తల్లిదండ్రులు లేరని, తరచూ గుడులు తిరుగుతుంటాడని, ఎందుకు కిడ్నాప్ చేశాడో తెలియడం లేదని గ్రామస్తులు చెబుతుండటం గమనార్హం. నవ్యశ్రీని వారి తల్లిదండ్రులు మహంత, వరలక్ష్మిల ఒడికి చేర్చడంతో ఈ కథ సుఖాంతమైంది.