: లాతూరులో పెను విషాదం.. విషవాయువులు పీల్చి ఏడుగురు కార్మికుల మృతి
మహారాష్ట్రలోని లాతూరులో పెను విషాదం చోటుచేసుకుంది. అక్కడి పారిశ్రామిక ప్రాంతంలోని ఓ ఆయిల్ మిల్లులోని కెమికల్ ట్యాంకును శుభ్రం చేసేందుకు వెళ్లిన ఏడుగురు కార్మికులు మృత్యువాత పడ్డారు. విషవాయువులు పీల్చడం వల్లే కార్మికులు మృతి చెంది ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. ట్యాంకును శుభ్రం చేసేందుకు ఉపయోగించిన ద్రవం.. ట్యాంకులోని రసాయనాలతో కలవడం వల్ల ఏర్పడిన రియాక్షన్ కారణంగా విషవాయువులు వెలువడి ఉండొచ్చని భావిస్తున్నారు.
ట్యాంకును శుభ్రం చేసేందుకు వెళ్లిన కార్మికులు గంటలు గడుస్తున్నా రాకపోవడంతో మరికొందరిని అక్కడికి పంపించారు. వారు కూడా ఎంతకీ తిరిగి రాకపోవడంతో కీడు శంకించిన మిల్లు యాజమాన్యం అక్కడికి వెళ్లి చూడగా తీవ్ర అస్వస్థతకు గురై చలనం లేకుండా పడి ఉన్న కార్మికులను గుర్తించారు. వెంటనే వారిని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే వారు మరణించినట్టు వైద్యులు ధ్రువీకరించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.