: కొత్త బడ్జెట్టుతో ప్రతి వర్గానికి మేలు జరుగుతుందట!
త్వరలో ప్రవేశపెట్టనున్న కేంద్ర బడ్జెట్ ఎలా ఉండబోతుందనే విషయం ఆసక్తిదాయకంగా మారింది. ఈ నేపథ్యంలో కేంద్ర పౌరవిమానయాన శాఖ సహాయ మంత్రి జయంత్ సిన్హా మాట్లాడుతూ, అన్ని వర్గాలను దృష్టిలో ఉంచుకుని ఈసారి బడ్జెట్ ఉండబోతోందని, త్వరలో ప్రవేశపెట్టనున్న బడ్జెట్ లో ప్రతి ఒక్కరికీ ఏదో ఒక స్పెషాలిటీ కనిపిస్తుందని చెప్పారు. ప్రతి బడ్జెట్ ఓ సవాల్ లాంటిదేనని, బడ్జెట్ సమతుల్యత చాలా కీలకం కానుందని అన్నారు. నోట్ల రద్దు తర్వాత ఆర్థిక వ్యవస్థను పరుగులు పెట్టించడం పెద్ద సవాలేనని, ప్రభుత్వం ఆ దిశగా తగిన చర్యలు తీసుకుంటోందని అన్నారు. జీఎస్ టీ అమలుకు సన్నాహకాలన్నీ పూర్తయ్యాయని అన్నారు. నోట్ల రద్దు తర్వాత పన్నుల వసూళ్లు పెరిగాయని, దేశ ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి ఇది ఉపకరిస్తుందని, అలాగే, నోట్ల రద్దు తర్వాత నల్లధనంపై జరుపుతున్న పోరాటం మరింత బలపడిందన్నారు. విమానాశ్రయాల విస్తరణకు సంబంధించి బడ్జెట్ లో ఏదో ఒక ప్రత్యేకత ఉంటుందని అంచనా వేస్తున్నట్టు జయంత్ సిన్హా పేర్కొన్నారు.