: ట్రంప్ విధించిన నిషేధంపై బ్రిటన్, జర్మనీ, ఫ్రాన్స్, ఆస్ట్రేలియా, కెనడాలేమన్నాయంటే..!
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ముస్లింలకు చెందిన ఏడు దేశాలపై నిషేధం విధిస్తూ తీసుకున్న వివాదాస్పద నిర్ణయంపై ప్రపంచ దేశాలు స్పందించాయి. అమెరికాలోని ఉన్నతోద్యోగుల్లో అత్యధికులు ట్రంప్ నిర్ణయాన్ని తూర్పారపడుతుండగా, ప్రపంచంలో పలుకుబడి ఉన్న ఐదు దేశాధినేతలు ఏమంటున్నారంటే....
బ్రిటన్
ముస్లింలను నిషేధించడమనేది 'ఓ విభజన, తప్పు' అంటూ బ్రిటన్ విదేశాంగ కార్యదర్శి బోరిస్ జాన్సన్ అభిప్రాయపడ్డారు. అగ్రదేశాధినేత ఇలాంటి నిర్ణయం తీసుకోవడం సిగ్గుచేటు అని, దీనిని క్రూరమైన చర్యగా భావించవచ్చని లండన్ మేయర్ పేర్కొన్నారు. ఇలాంటి నిర్ణయాలను తాము స్వాగతించమని ఆయన పేర్కొన్నారు. అయితే ఇమ్మిగ్రేషన్ విధానం ఆ దేశ వ్యక్తిగత వ్యవహారం అని తేల్చి చెప్పింది.
జర్మనీ
ఇది విచారకరమైన తీవ్ర నిర్ణయమని జర్మనీ ఛాన్సలర్ ఎంజెలా మెర్కెల్ అభిప్రాయపడ్డారు. ఉగ్రవాదంపై పోరాడటాన్ని ప్రతి ఒక్కరూ అంగీకరిస్తారని ఆమె తెలిపారు. అదే సమయంలో ఉగ్రవాదాన్ని ఓ ప్రాంతంలోని ప్రజలను బట్టి నిర్ణయించకూడదని సూచించారు. అంతే కాకుండా ఉగ్రవాదాన్ని మతాలవారీగా చూడకూడదని హితవు పలికారు.
ఫ్రాన్స్
శరణార్థులను స్వాగతించడమనేది సంఘీభావానికి చిహ్నంలాంటిదని ఫ్రాన్స్ విదేశాంగ శాఖ మంత్రి జీన్ మార్క్ ఐరాల్ట్ తెలిపారు. ఉగ్రవాదానికి ఒక జాతి అంటూ లేదన్న విషయాన్ని గుర్తించాలని ఆయన సూచించారు. వివక్ష ఏ సమస్యకు, ఎన్నటికీ పరిష్కారం అనిపించుకోదన్న విషయాన్ని గుర్తించాలని ఆయన హితవు పలికారు.
కెనడా
సంరక్షణ అనేది శరణార్ధులను స్వాగతించడానికి కావాల్సిన ముఖ్యమైన అంశమని కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడీ తెలిపారు. అంతేకాకుండా ఉగ్రవాదం, యుద్ధం, మతహింస పేరిట ఎవరైతే వివక్ష లేదా హింసకు గురవుతున్నారో వారందరికీ కెనడా స్వాగతం పలుకుతోందని ప్రకటించి ప్రపంచ మెప్పు పొందారు.
ఆస్ట్రేలియా
సరిహద్దులు దాటి దేశంలోకి ఎవరు వస్తున్నారో తెలుసుకోవడం ప్రతి దేశానికి చాలా ముఖ్యమైన అంశమని ఆస్ట్రేలియా ప్రధాని మాల్కోమ్ టర్న్ బుల్ తెలిపారు. ట్రంప్ తో మాట్లాడిన ఆయన నిషేధాన్ని దేశరక్షణగా చూడాలని సూచించారు. కాగా, ట్రంప్ నిర్ణయాన్ని ఆయన సమర్థించారు.