: మాజీ మిలిటెంట్ ఇంట్లో రహస్యంగా బస చేసిన కేజ్రీవాల్
ప్రస్తుతం పంజాబ్ ఎన్నికల్లో భాగంగా ఆమ్ ఆద్మీ పార్టీ అభ్యర్థుల విజయం కోసం బిజీగా పర్యటనలు జరుపుతున్న ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ రహస్యంగా ఓ మాజీ మిలిటెంట్ ఇంటికి వెళ్లి బస చేయడం తీవ్ర దుమారాన్ని రేపింది. జిరాలో జరిగిన ఎన్నికల సభలో పాల్గొన్న అనంతరం, కేజ్రీవాల్ ఎవరికీ చెప్పకుండా ఖలిస్థాన్ కమాండో ఫోర్స్ మాజీ మిలిటెంట్ గురీందర్ సింగ్ నివాసానికి వెళ్లారు. ప్రస్తుతం ఇంగ్లండ్ లో తలదాచుకుంటున్న గురీందర్, తన నివాసాన్ని స్నేహితుడు సత్నాం సింగ్ కు లీజుకు ఇవ్వగా, కేజ్రీవాల్ మరో చోటు దొరకనట్టు ఆ ఇంటికి వెళ్లడం ఇప్పుడు ఆయనపై విమర్శలకు కారణమైంది. గురీందర్ ఇంట్లో కేజ్రీవాల్ బస చేసినట్టు పోలీసు వర్గాలు స్పష్టం చేయడంతో, ఎన్నికల్లో ఓట్ల కోసం ఆయన రాడికల్స్ తో తిరుగుతున్నారని అటు కాంగ్రెస్, ఇటు అకాలీదళ్ మండిపడుతున్నాయి.