: రాజీవ్ గాంధీ హత్యకు గురవుతారని ఐదేళ్ల ముందే అమెరికాకు తెలుసా?


ప్రపంచ దేశాల వైఫల్యమో లేక అమెరికా నిఘా వర్గాల గొప్పతనమో కానీ ప్రపంచ దేశాల్లో జరిగే, జరగబోయే ఎలాంటి సంఘటనైనా ప్రపంచ పెద్దన్నకు ముందుగానే తెలిసిపోతుంది. అలాగే భారత చరిత్రలో అత్యంత దురదృష్టకరమైన రాజీవ్ గాంధీ హత్య గురించి ఐదేళ్ల ముందే తెలుసని అమెరికా నిఘా సంస్థ సీఐఏ వెల్లడించిన పత్రాలు తెలిపాయి. భారత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీని ఎల్టీటీఈ తీవ్రవాదులు పెరంబదూర్ లో అభిమానుల రూపంలో 1991 మే 21న హత్య చేసిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో ఆయన శరీర భాగాలు కూడా గుర్తించనలవి కాని విధంగా బెల్టు బాంబుతో హతమార్చారు.

ఈ మేరకు సీఐఏ వెల్లడించిన పత్రాల్లో 1986 వరకు సీఐఏకు అందిన సమాచారం మేరకు  'భారత ప్రధాని రాజీవ్‌ గాంధీ ఆయన పదవికాలం ముగిసేనాటికి హత్యకు గురయ్యే అవకాశం ఉంది. ఆయనకు అత్యంత సమీపంగా ఉన్న అతిపెద్ద ముప్పు హత్యాప్రయత్నమే' అని సీఐఏ పత్రాల్లో స్పష్టంగా ఉంది. రాజీవ్‌ హత్యకు గురయితే కచ్చితంగా భారత్‌ తో అమెరికా, రష్యాలకున్న సంబంధాలపై ప్రభావం పడుతుందని సీఐఏ అప్పట్లోనే అంచనా వేసింది. పలు గ్రూపులు రాజీవ్‌ హత్యకోసం యత్నిస్తున్నాయని, అది ఏ సమయంలోనైనా జరిగే అవకాశం ఉందని సీఐఏ రిపోర్టు తెలిపింది.

అంతేకాకుండా తాము చెప్పినట్టు రాజీవ్‌ గాంధీ హత్యకు గురైతే ఆయన తరువాత కాంగ్రెస్ తరపున ప్రధానిగా పీవీ నరసింహారావు లేదా వీపీ సింగ్‌ వంటి అనుభవజ్ఞులైన ప్రజ్ఞావంతులు ప్రధానిగా బాధ్యతలు తీసుకునే అవకాశం ఉందని కూడా సీఐఏ తెలిపింది. కాగా, 1991 లో పీవీ నరసింహారావు ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన సంగతి, సంకీర్ణ ప్రభుత్వాన్ని ఎలాంటి అడ్డంకులు లేకుండా ఐదేళ్లు నడిపించిన సంగతి తెలిసిందే. 

  • Loading...

More Telugu News