: ఉత్తరాఖండ్ ఎన్నికల తాయిలం: కాల్స్, డేటాతో పాటు స్మార్ట్ ఫోన్ కూడా ఉచితమేనంటున్న హరీశ్ రావత్
వచ్చే నెలలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న ఉత్తరాఖండ్ లో అధికారాన్ని నిలుపుకోవడమే ఏకైక లక్ష్యంతో కాంగ్రెస్ పార్టీ తన మ్యానిఫెస్టోలో వరాల జల్లు కురిపించింది. రాష్ట్రంలోని ప్రతి యువకుడికీ ఓ స్మార్ట్ ఫోన్ ను అందిస్తామని, ఆ ఫోన్లకు ఉచిత కాలింగ్ సౌకర్యం, ఇంటర్నెట్ ఉంటాయని ముఖ్యమంత్రి హరీశ్ రావత్ ప్రకటించారు. రాష్ట్రంలో నిరుద్యోగులైన యువతకు నెలకు రెండున్నర వేల రూపాయలను ఇస్తామని, ప్రభుత్వ ఉద్యోగాల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని చెప్పారు. ఇంటికో ఉద్యోగం ఉండేలా చూస్తామన్నారు. సైనికుల సమస్యల పరిష్కారం కోసం ప్రత్యేక మంత్రిత్వ శాఖ, అన్ని గ్రామాల్లో మంచి నీటి సౌకర్యం వంటి ఎన్నో హామీలను గుప్పించారు. కాగా, ఈ పథకాలకు నిధులను ఎక్కడి నుంచి తెస్తారని విపక్షాలు కాంగ్రెస్ ను విమర్శించాయి. గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలనే హరీశ్ ప్రభుత్వం ఇప్పటికీ నెరవేర్చలేదని బీజేపీ ఆరోపించింది.