: సభాహక్కుల కమిటీ విచారణ పూర్తి.. ఐదుగురు వైసీపీ ఎమ్మెల్యేలపై చర్యలకు సిఫారసు!
ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా డిమాండ్ చేస్తూ గత శాసనసభ సమావేశాల్లో కొందరు వైసీపీ సభ్యులు సృష్టించిన రగడపై ఆంధ్రప్రదేశ్ సభా హక్కుల కమిటీ విచారణ పూర్తిచేసింది. అసెంబ్లీ సిబ్బందిపై దాడి చేసి సభను అడ్డుకుని, గందరగోళం, విధ్వంసం సృష్టించిన మొత్తం 12 మంది వైసీపీ ఎమ్మెల్యేలను విచారణ కమిటీ పిలిపించి విచారించింది. సభలో వారు ప్రవర్తించిన వీడియోలు చూపించి వివరణ కోరింది. కమిటీ ఎదుట హాజరైన 12 మందిలో ఏడుగురు ఎమ్మెల్యేలు తమకు తెలియకుండా జరిగిన తప్పిదమని పేర్కొంటూ క్షమాపణ కోరడంతో వారి విషయాన్ని కమిటీ పక్కన పెట్టింది. మిగతా ఐదుగురు ఎమ్మెల్యేలు ఇచ్చిన సమాధానాలపై కమిటీ అసంతృప్తి వ్యక్తం చేసింది.
చైర్మన్ గొల్లపల్లి సూర్యారావు అధ్యక్షతన శనివారం నిర్వహించిన తుది సమావేశంలో అన్ని విషయాలను కూలంకషంగా చర్చించిన కమిటీ ఐదుగురు వైసీపీ ఎమ్మెల్యేలు దాడిశెట్టి రాజా, ఆళ్ల రామకృష్ణారెడ్డి, చెవిరెడ్డి భాస్కరరెడ్డి, బి.ముత్యాలనాయుడు, కె.శ్రీనివాసులుపై చర్యకు సిఫారసు చేయాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది. ఈమేరకు ఫిబ్రవరి తొలివారంలో స్పీకర్ కోడెల శివప్రసాదరావుకు నివేదిక అందజేయనున్నట్టు కమిటీ చైర్మన్ గొల్లపల్లి తెలిపారు. మరోవైపు కమిటీ నిర్ణయాన్ని విభేదిస్తున్నట్టు కమిటీ సభ్యుడు, వైసీపీ ఎమ్మెల్యే రామచంద్రారెడ్డి పేర్కొన్నారు. ప్రతిపక్షాలు సభను అడ్డుకోవడం కొత్తేమీ కాదని, గతంలో చంద్రబాబు ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు ఆయన వ్యాఖ్యలకు అప్పటి ఉపసభాపతి కన్నీళ్లు కూడా పెట్టుకున్నారని తెలిపారు.