: ఈ రోజు నాకు చాలా ఆనందంగా ఉంది: విశాఖపట్నంలో ముఖ్యమంత్రి చంద్రబాబు
విశాఖపట్నంలో నిన్న ప్రారంభమైన సీఐఐ భాగస్వామ్య సదస్సు ఈ రోజు ముగిసింది. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు ముగింపు ఉపన్యాసం చేస్తూ.. ఈ రోజు తనకు చాలా సంతోషంగా ఉందని అన్నారు. రాష్ట్రానికి భారీగా పెట్టుబడులు వచ్చాయని చెప్పారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టిన వారికి అన్ని అనుమతులను ప్రభుత్వం త్వరగా ఇస్తుందని చెప్పారు. 14 రోజుల్లోనే అన్ని కంపెనీలకు అనుమతులు లభిస్తాయని అన్నారు. 2030 నాటికి రాష్ట్ర సమగ్ర అభివృద్ధే తమ లక్ష్యమని తెలిపారు.
రాజధాని అమరావతికి భారీగా పెట్టుబడులు వచ్చాయని చంద్రబాబు తెలిపారు. రాష్ట్రంలో పెట్టుబడులకు ఎన్నో అవకాశాలు ఉన్నాయని, దేశంలో ఇన్ని అవకాశాలు మరే రాష్ట్రంలోనూ లేవని తెలిపారు. అవినీతి రహిత పాలన ఏపీలో నడుస్తోందని చెప్పారు. రాష్ట్ర విభజన తరువాత ఆంధ్రప్రదేశ్‌కి ఉత్తమ విశ్వవిద్యాలయాలు వస్తున్నాయని తెలిపారు. ఏపీలో చమురు నిల్వలు సమృద్ధిగా ఉన్నాయని తెలిపారు. చమురు నిల్వలు, తీర ప్రాంతాలు పారిశ్రామికాభివృద్ధిలో కీలకం కానున్నాయని తెలిపారు.
పెట్రోలియం, విద్యా రంగంలో ఎన్నో ఒప్పందాలు కుదిరాయని చంద్రబాబు చెప్పారు. అమరావతిలో పెట్టుబడులు పెట్టేందుకు ఎన్నో సంస్థలు ఆసక్తి కనబరిచాయని చెప్పారు. రాష్ట్రంలో మరిన్ని పెట్టుబడులకు అవకాశాలు ఉన్నాయని చెప్పారు. పరిశ్రమలకు అవసరమైన అన్ని వనరులను, సదుపాయాలను మీకు అందిస్తామని అన్నారు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు చేయూతనిచ్చేందుకు తాము వ్యవసాయరంగంపై అధికంగా దృష్టిపెట్టామని చెప్పారు. అగ్రో ప్రాసెసింగ్ లో ఏపీలో విస్తృత అవకాశాలు ఉన్నాయని తెలిపారు.