: ఏడు రకాల సెక్టార్లపై మేము ప్రధానంగా దృష్టి సారించాం: చంద్రబాబునాయుడు
ప్రధానంగా ఏడు సెక్టార్లపై దృష్టి సారించామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తెలిపారు. విశాఖపట్టణంలో ఆయన మాట్లాడుతూ, ఏడు ప్రధాన అంశాల్లో ప్రభుత్వం సాధికారత సాధించేందుకు కృషి చేస్తోందని అన్నారు. అవి వ్యవసాయ, పారిశ్రామిక, విద్య, వైద్యారోగ్య, ఆర్థిక పరిపుష్టి, రోడ్లు, మౌలిక సదుపాయాలు, నిరంతరాయ విద్యుత్ వంటి అంశాల్లో సాధికారత సాధించాలని కృతనిశ్చయంతో ఉన్నామని ఆయన చెప్పారు. రాష్ట్ర ప్రజలకు పండగలకు 400 రూపాయల విలవ చేసే గిఫ్ట్ ప్యాక్ లను ప్రభుత్వం అందజేసిందని ఆయన అన్నారు. వ్యవసాయ రంగంలో సంస్కరణలు తీసుకొచ్చామని ఆయన చెప్పారు. రైన్ గన్స్ ను అందుబాటులోకి తీసుకొచ్చామని ఆయన తెలిపారు.
హుదూద్ సందర్భంగా వైజాగ్ లో విద్యుత్ వినియోగం పెరుగుతుందని గుర్తించి, ఎల్ఈడీ బల్బులను అందుబాటులోకి తీసుకొచ్చామని అన్నారు. మున్సిపాలిటీల్లో కూడా ఎల్ఈడీ బల్బులు అమర్చామని, దీంతో విద్యుత్ ఆదా అవ్వడం మొదలైందని, దీంతో ఇప్పుడు పంచాయతీల్లో ఎల్ఈడీ బల్బులను వినియోగంలోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నామని చెప్పారు. అలాగే ఏపీలోని ప్రతి ఒక్కరూ కొంత మొత్తం సంపాదించే దిశగా చర్యలు చేపట్టామని ఆయన తెలిపారు. ఏపీకి విశేషమైన ఇన్ ఫ్రాస్ట్రక్చర్ ఉందని, ఏపీలో అద్భుతమైన సహజ వనరులున్నాయని ఆయన తెలిపారు. కోహినూరు వజ్రం కూడా ఏపీదేనని, గుంటూరు గనుల్లో దొరికిందని, నిజాం దానిని తీసుకున్నారని ఆయన తెలిపారు.