: గుజరాత్ లోని వివాదాస్పద సాధ్వి నివాసంలో 24 బంగారం కడ్డీలు, 1.2 కోట్ల కొత్త నోట్లు, మద్యం బాటిళ్లు లభ్యం!

ఆధ్యాత్మిక ప్రవచనాలు చెప్పుకునే సాధ్వి జై శ్రీగిరి నివాసంలో భారీ మొత్తంలో బంగారం, డబ్బు, మద్యం బాటిళ్లు లభ్యం కావడంతో పోలీసులు ఆశ్చర్యపోయిన ఘటన గుజరాత్ లో చోటుచేసుకుంది. ఈ ఘటన వివరాల్లోకి వెళ్తే... గుజరాత్ లోని అహ్మదాబాద్ సమీపంలోని బనస్కాంత జిల్లాలో సాధ్వి జై శ్రీగిరి అనే మహిళ ఓ ట్రస్టు నడుపుతున్నారు. ఆ ట్రస్టు ఆధ్వర్యంలో ఒక ఆలయం కూడా ఉంది. అయితే, ఆమెపై ఓ నగల వ్యాపారి తాజాగా పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన వద్ద కొనుగోలు చేసిన ఐదు కోట్ల రూపాయల నగలకు ఆమె డబ్బులు చెల్లించడం లేదని, ఎన్నిసార్లు ఆమెను కోరినా పట్టించుకోవడం లేదని, ఆమెపై చర్యలు తీసుకోవాలని ఆయన తన ఫిర్యాదులో కోరారు.

 గత డిసెంబర్ లో ఒక కార్యక్రమంలో పాడుతున్న గాయనీ గాయకులపై ఆమె సుమారు కోటి రూపాయల విలువైన 2,000 రూపాయల నోట్ల వర్షం కురిపించారు. దీనిని ఓ వ్యక్తి వీడియో తీయడంతో ఆ ఘటన వెలుగులోకి వచ్చింది. డిసెంబర్ లో 2,000 నోట్ల రూపాయలు దొరకడమే కష్టమైన తరుణంలో ఆమె కొత్త నోట్లు విసరడం వివాదంగా మారింది. దీంతో ఆమె నివాసంపై పోలీసులు దాడులు నిర్వహించగా 80 లక్షల రూపాయల విలువ చేసే 24 బంగారం కడ్డీలు లభ్యమయ్యాయి. 1.2 కోట్ల రూపాయల కొత్త కరెన్సీ పట్టుబడింది. దీనికి తోడు మద్యం బాటిళ్లు కూడా దొరికాయి. గుజరాత్ లో మద్యనిషేధం అమలులో ఉంది. నిషేధం అమలులో ఉన్నప్పటికీ ఆమె వద్ద మద్యం లభించడం విశేషం. ఆమెతో పాటు ముగ్గురిపై కేసులు నమోదు చేశామని, ఆమె ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్నారని పోలీసులు తెలిపారు. 

More Telugu News