: తల్లిదండ్రులారా... మీ పిల్లలను నేడు బయటకు పంపొద్దు: హెచ్చరిస్తున్న పోలీసులు, వర్శిటీలు
రాష్ట్రానికి ప్రత్యేక హోదాను సాధించడమే లక్ష్యంగా నేడు విశాఖపట్నంలోని ఆర్కే బీచ్, విజయవాడ కృష్ణా తీరం, తిరుపతి ఎస్వీ యూనివర్శిటీల్లో ఏపీ యువత ప్రత్యేక నిరసన ప్రదర్శనలకు సిద్ధమవుతున్న వేళ, విద్యార్థులు ఆందోళనల్లో పాల్గొనకుండా చూడాలని అటు పోలీసులు, ఇటు వర్శిటీల యాజమాన్యాలు తల్లిదండ్రుల మొబైల్ ఫోన్లకు టెక్ట్స్ మెసేజ్ లు పంపుతున్నాయి.
"తల్లిదండ్రులారా, దయచేసి సోషల్ మీడియాలో వస్తున్న ఆహ్వానాలను చూసి స్పందించవద్దని మీ పిల్లలకు చెప్పండి. ముఖ్యంగా విద్యాభ్యాసం చేస్తూ, ఈ తరహా నిరసనల్లో పాల్గొంటే సరిదిద్దుకోలేని పరిస్థితులు ఏర్పడవచ్చు" అని గీతమ్ యూనివర్శిటీ రిజిస్ట్రార్ పేరిట మెసేజ్ లు వచ్చాయి. ఇదే తరహాలో వివిధ ప్రైవేటు వర్శిటీలు, కాలేజీలు, పోలీసుల నుంచి మెసేజ్ లు వస్తున్నట్టు సమాచారం. హోదా ఆందోళనల్లో పాల్గొంటే అవాంఛనీయ పరిణామాలు జరగొచ్చని హెచ్చరికలు జారీ చేస్తున్నాయి.