: చంచల్‌గూడ, వరంగల్ సెంట్రల్ జైళ్ల తరలింపు.. మొండిగౌరెల్లికి 'చంచల్‌గూడ!'
హైదరాబాద్‌లోని చంచల్‌గూడ జైలు, వరంగల్ సెంట్రల్ జైలు మరో ప్రాంతాలకు తరలిపోనున్నాయి. వీటితోపాటు హైదరాబాద్ రేస్‌కోర్సు కూడా తరలిపోనుంది. ఈ మూడింటిని వేరే ప్రాంతానికి తరలించాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు అధికారులను ఆదేశించారు. వరంగల్ జైలును తరలించాక దానికి ఆనుకుని ఉన్న కాకతీయ మెడికల్ కాలేజీ(కేఎంసీ) ప్రాంగణాన్ని కలుపుకుని సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మించనున్నారు.
చంచల్‌గూడ జైలును తరలించాక ఆ ప్రాంతంలో రెసిడెన్షియల్ స్కూల్ ఏర్పాటు కానుంది. ఇందుకు అవసరమైన నిధులను వచ్చే బడ్జెట్‌లోనే కేటాయించాలని సూచించారు. బుధవారం ప్రగతి భవన్‌లో జైళ్ల తరలింపుపై అధికారులతో సమీక్షించిన కేసీఆర్ ఈ ఆదేశాలు జారీ చేశారు. అయితే ప్రత్యేక ఏర్పాట్లు పూర్తయ్యాకే జైళ్ల తరలింపు చేపట్టాలని సూచించారు. మహబూబ్‌నగర్ జిల్లాలో 40 ఎకరాల విస్తీర్ణంలో కొత్త జైలు నిర్మాణానికి ప్రతిపాదనలు పంపాలని సూచించారు. చంచల్‌గూడ జైలును రంగారెడ్డి జిల్లా యాచారం మండలంలోని మొండిగౌరెల్లికి తరలించనున్నట్టు సమాచారం. కొత్త జైలు నిర్మాణానికి వంద కోట్ల రూపాయల వరకు ఖర్చవుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు.