: 'తేల్చుకుందాం రా' అంటూ ఎమ్మెల్యే చింతమనేనిపై మంత్రి సుజాత నిప్పులు!
తనకు తెలియకుండానే తన నియోజకవర్గంలో కల్పించుకున్నారని ఆరోపిస్తూ, ఏపీ స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి పీతల సుజాత, ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ పై నిప్పులు చెరిగారు. టీడీపీ జిల్లా సమన్వయ కమిటీ సమావేశం జరుగగా, ఇటీవల ఓ సినిమా థియేటర్ ప్రారంభోత్సవం సందర్భంగా ఇరు నేతల మధ్యా జరిగిన వివాదం చర్చకు వచ్చింది. తన నియోజకవర్గంలో తనకు ఆహ్వానం లేని ప్రారంభోత్సవానికి సొంత పార్టీ నుంచే మరో నేత ఎలా వస్తారని సుజాత ప్రశ్నించగా, మరొకరి ఆమోదం పొందాల్సిన అవసరం లేదని, తనను పిలిస్తే ఎక్కడికైనా వెళతానని చింతమనేని గట్టిగానే సమాధానం ఇచ్చినట్టు సమాచారం.
దీంతో ఆగ్రహానికి లోనైన మంత్రి "ఎస్సీ నియోజకవర్గమని మీ ఇష్టం వచ్చినట్టు చేస్తే చూస్తూ ఊరుకునేది లేదు... రా తేల్చుకుందాం" అని తీవ్ర వ్యాఖ్యలు చేశారని తెలుస్తోంది. ఆ సమయంలో అక్కడే ఉన్న జిల్లా ఇన్ చార్జ్ మంత్రి అయ్యన్నపాత్రుడు జోక్యం చేసుకుని ఇరువురికీ నచ్చజెప్పారు. స్థానిక ఎమ్మెల్యేకు తెలియకుండా, ఈ తరహా కార్యక్రమాల్లో పాల్గొనడం సరికాదని ప్రభాకర్ ను వారించినట్టు పార్టీ వర్గాలు తెలిపాయి.